పెద్దపల్లి, 2026-07-24
పెద్దపల్లి పట్టణంలో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియపై ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు పట్టణ కౌన్సిలర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా SIR ప్రక్రియలో అప్రమత్తంగా ఉండాలని, అర్హులైన ప్రతి ఓటరు జాబితాలో చేరేలా చూడాలని ఆయన సూచించారు.
రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియ నిర్వహణలో భాగంగా పెద్దపల్లి పట్టణ మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లతో ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసనసభ్యులు శ్రీ. చింతకుంట విజయరమణ రావు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా SIR ప్రక్రియ పట్ల ప్రతి కార్యకర్త, పట్టణ కౌన్సిలర్లు అప్రమత్తంగా వ్యవహరించాలని, అర్హులైన ప్రతి ఓటరు జాబితాలో ఉండేలా చూడాలని ఆయన సూచించారు.
బూత్ లెవెల్ ఆఫీసర్లు (BLO) ఇంటింటికి వచ్చినప్పుడు ప్రజలు సహకరించాలని, ప్రతి ఓటరు తమ పేరు, చిరునామా, కుటుంబ వివరాలు, ఇతర సమాచారాన్ని క్షుణ్ణంగా పరిశీలించి అవసరమైన సమాచారం అందించాలని కోరారు. పెద్దపల్లి పట్టణంలోని ప్రతి కాంగ్రెస్ ప్రజాప్రతినిధి తమ వార్డుల ఓటర్లకు అవగాహన కల్పించాలని, ఎన్నికలు ఉన్నప్పుడే కాకుండా ముందస్తుగా ఓటర్ల జాబితాను, ఓట్ల లెక్కలను పరిశీలించాలని సూచించారు.
ప్రజల విశ్వాసాన్ని, తీర్పును గెలుచుకోలేనివారు ఓటర్ల జాబితాల్లో గందరగోళం సృష్టించి, ఓట్లను తొలగించడం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నించే ప్రజాస్వామ్య వ్యతిరేక రాజకీయాలకు తెలంగాణలో తావు లేదని అన్నారు. SIR ప్రక్రియ పూర్తయ్యే వరకు పట్టణ కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, బూత్ లెవల్ ఏజెంట్లు (BLA) అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి అర్హుడి ఓటు జాబితాలో ఉండేలా కాంగ్రెస్ శ్రేణులు క్షేత్రస్థాయిలో ప్రజలకు సహాయసహకారాలు అందించాలని సూచనలు చేశారు.











