మంచిర్యాల (ప్రజావార్త) ఆగస్టు 25
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం 1908 రిజిస్ట్రేషన్ చట్టం ద్వారా 22-ఏ సెక్షన్ తీసుకువచ్చిందని, ఇది కాంగ్రెస్ నాయకులు దోచుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుందని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్ ఆరోపించారు. మంచిర్యాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, పేద ప్రజల నుండి డబ్బులు వసూలు చేయడానికే ఈ పని చేస్తున్నారని ఆయన విమర్శించారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం 1908 రిజిస్ట్రేషన్ చట్టం ద్వారా 22-ఏ సెక్షన్ తీసుకువచ్చిందని, ఇది కాంగ్రెస్ నాయకులు దోచుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుందని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్ ఆరోపించారు. మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని నస్పూర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
అసెంబ్లీ ఎన్నికల హామీలు గాలికి
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అర్హులైన వారందరికీ ఇళ్ల పట్టాలు ఇప్పిస్తామని దొంగ మాటలు చెప్పి గెలిచారని, అధికారంలోకి వచ్చాక హామీలను గాలికి వదిలేసి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని విజిత్ కుమార్ విమర్శించారు. హామీ ఇచ్చిన విధంగా పట్టాలు ఇవ్వకుండా, గతంలో దివాకర్ రావు గారు ఇచ్చిన పట్టాలను కూడా నిషేధిత జాబితాలో చేర్చడం దుర్మార్గమని అన్నారు.
ధన దాహంతో అధికారులకు ఆదేశాలు
ధన దాహంతో పైసలు వసూలు చేయడమే లక్ష్యంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు తన టార్గెట్ చేసిన భూములను, ఇళ్లను 22-ఏ నిషేధిత జాబితాలో చేర్చాలని అధికారులను ఆదేశించారని, దీని ద్వారా పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేయాలనే దుర్మార్గపు ఆలోచన ఉందని విజిత్ కుమార్ ఆరోపించారు. మంచిర్యాల నియోజకవర్గంలో 1908 చట్టం ప్రకారం కాకుండా, ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు చట్టం ద్వారానే ఆస్తులను, భూములను నిషేధిత జాబితాలో చేర్చారని, ఎమ్మెల్యే ఇంటి నుంచి వచ్చిన జాబితా ప్రకారమే రెవెన్యూ అధికారులు 22-ఏ జాబితాలో పేర్లు పొందుపరిచారని ఆయన తెలిపారు.
10,332 ఇళ్లు నిషేధిత జాబితాలో
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జీవో 22-ఏ నిషేధిత జాబితా ప్రకారం మొత్తం 10,332 ఇళ్లను నిషేధిత జాబితాలో చేర్చారని విజిత్ కుమార్ వెల్లడించారు. ఇందులో మంచిర్యాల - 2,222, గర్మిళ్ల - 1,963, నస్పూర్ - 3,138, తాళ్లపల్లి - 803, సింగపూర్ - 2,206 ఇళ్లు ఉన్నాయని, ఈ ఇళ్లను నిషేధిత జాబితాలో చేర్చి పేద ప్రజల నుండి డబ్బులు వసూలు చేయడానికే ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఈ పని చేశారని ఆయన ఆరోపించారు.
భూముల అమ్మకం, కొనుగోలుకు ఆటంకం
నిషేధిత జాబితాలో ఇళ్లను చేర్చడం ద్వారా భూముల అమ్మకం, కొనుగోలు, భూమిపై లోన్ తీసుకోవడం వంటి వాటికి మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఆటంకం కలిగించారని విజిత్ కుమార్ అన్నారు. గతంలో కేసీఆర్ నాయకత్వంలో శ్రీరాంపూర్ ఏరియాలో నడిపెల్లి దివాకర్ రావు గారు సింగరేణి స్థలాలలో ఉంటున్న దాదాపు 3 వేల మందికి రిజిస్ట్రేషన్ తో సహా పట్టాలు ఇచ్చారని, దివాకర్ రావు గారు పట్టా ఇస్తే, ప్రేమ్ సాగర్ రావు గారు వాటిని నిషేధిత జాబితాలో చేర్చారని ఆయన పేర్కొన్నారు.












