భర్త మిగ్-21 ప్రమాదంలో మరణించిన నేపథ్యంలో, స్క్వాడ్రన్ లీడర్ ప్రియాంక సక్సేనాను తిరిగి భారత వైమానిక దళంలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దాదాపు 14 ఏళ్ల విరామం తర్వాత ఆమె సేవల్లోకి తిరిగి రావడానికి మార్గం సుగమమైంది.
మాజీ షార్ట్ సర్వీస్ కమిషన్డ్ అధికారి, స్క్వాడ్రన్ లీడర్ ప్రియాంక సక్సేనాను తిరిగి భారత వైమానిక దళంలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. భర్త, వింగ్ కమాండర్ హర్షిత్ సిన్హా 2021లో మిగ్-21 బైసన్ విమాన ప్రమాదంలో మరణించిన తర్వాత ప్రియాంక సక్సేనా తిరిగి సేవల్లో చేరేందుకు ప్రయత్నించారు. దాదాపు 14 ఏళ్ల విరామం తర్వాత ఆమెను మళ్లీ వైమానిక దళంలోకి తీసుకోవాలని కోర్టు నిర్ణయించింది.
ప్రియాంక సక్సేనా 2000లో హైదరాబాద్‌లోని వైమానిక దళ అకాడమీలో చేరారు. 2003లో అధికారిగా నియమితులైన ఆమె జైసల్మేర్‌లోని 41 వింగ్‌లో తొలి పోస్టింగ్ పొందారు. సుమారు పదేళ్లపాటు వైమానిక దళంలో సేవలందించిన ఆమెకు పశ్చిమ వైమానిక కమాండ్ అధిపతి నుంచి ప్రశంసా పురస్కారం కూడా లభించింది.
2012లో తొలి కుమార్తె జన్మించిన తర్వాత కుటుంబ బాధ్యతలు, భర్తకు సహకరించాల్సిన పరిస్థితుల కారణంగా ఆమె షార్ట్ సర్వీస్ కమిషన్ నుంచి వైదొలిగారు. అనంతరం 2016లో రెండో కుమార్తె జన్మించింది. 2024న ఆమె భర్త హర్షిత్ సిన్హా మిగ్-21 బైసన్ విమాన ప్రమాదంలో మృతి చెందారు. దీంతో తన గత సేవా అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని తిరిగి వైమానిక దళంలో చేరేందుకు ఆమె దరఖాస్తు చేసుకున్నారు.
అయితే అప్పటికే ఆమె వయసు 35 ఏళ్ల పరిమితిని దాటడంతో 2022లో దరఖాస్తును తిరస్కరించారు. అనంతరం సాయుధ దళాల ట్రైబ్యునల్‌ను ఆశ్రయించినప్పటికీ అక్కడ కూడా అనుకూల నిర్ణయం రాలేదు. దీంతో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్ వి. మోహనాలతో కూడిన ధర్మాసనం ఆమె కేసు ప్రత్యేకమైనదని పేర్కొంది. ఆమె ఒకవైపు మాజీ వైమానిక దళ అధికారి కాగా, మరోవైపు వైమానిక దళ అధికారి భార్యగా యుద్ధ వితంతువు అయ్యారని కోర్టు గుర్తించింది. ఇద్దరు పాఠశాల వయసు పిల్లలు ఉన్న విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంది.
ప్రియాంక సక్సేనా విషయంలో ఉన్న ప్రత్యేక పరిస్థితులకు ప్రస్తుత విధానాల్లో స్పష్టమైన పరిష్కారం లేదని సుప్రీంకోర్టు పేర్కొంది. ఆమె గతంలో చేసిన సైనిక సేవను పరిగణనలోకి తీసుకోవాలని, ఇతర యుద్ధ వితంతువులకు వర్తించే విధంగా పూర్తిస్థాయి కొత్త శిక్షణ అవసరం లేదని తెలిపింది.
కోర్టు రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 కింద తన ప్రత్యేక అధికారాలను ఉపయోగించి ఈ నిర్ణయం తీసుకుంది. ఇది ప్రియాంక సక్సేనా కేసుకు మాత్రమే వర్తించే ప్రత్యేక ఆదేశమని, భవిష్యత్ కేసులకు ఇది సాధారణ న్యాయపరమైన దృష్టాంతంగా పరిగణించరాదని స్పష్టం చేసింది.
ఇక ఆమె తిరిగి విధుల్లో చేరే ముందు ఒక సంవత్సరం రిఫ్రెషర్ శిక్షణ పూర్తి చేయాలి. నిర్దేశిత వైద్య ప్రమాణాలను కూడా పూర్తి చేయాల్సి ఉంటుంది. శిక్షణ అనంతరం గత సేవను లెక్కలోకి తీసుకుని 11వ సంవత్సరం సేవలో స్క్వాడ్రన్ లీడర్‌గా తిరిగి నియమించనున్నారు. అలాగే విధానాల ప్రకారం నాలుగేళ్ల సర్వీస్ పొడిగింపు, సీనియారిటీ, భవిష్యత్‌లో శాశ్వత కమిషన్, పదోన్నతి వంటి అంశాలను పరిశీలించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.









