తెలంగాణ ప్రభుత్వం పేదల ఇళ్ల జోలికొస్తే ఊరుకోబోమని తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర నాయకులు సయ్యద్ ఇస్మాయిల్ హెచ్చరించారు. మడ్ ఫోర్ట్ అంబేడ్కర్ హట్స్ బస్తీలో నివాసం ఉంటున్న పేదల ఇళ్లను కూల్చివేయాలనే ప్రభుత్వ ఆలోచనను వెంటనే విరమించుకోవాలని ఆయన సూచించారు.
మంగళవారం బంజారాహిల్స్ లోని టీఆర్ఎస్ కార్యాలయంలో మడ్ ఫోర్ట్ అంబేడ్కర్ బస్తీ వాసులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ బస్తీలో సుమారు 40 ఏళ్లుగా 650 పేదల కుటుంబాలు నివాసం ఉంటున్నాయని, వారిని రోడ్డున పడేసే ఆలోచన దుర్మార్గమని ఇస్మాయిల్ అన్నారు.
ప్రభుత్వం, కంటోన్మెంట్ అధికారులు బుల్డోజర్లతో బస్తీ వాసులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆయన ఆరోపించారు. మడ్ ఫోర్ట్ అంబేడ్కర్ బస్తీ వాసులకు టీఆర్ఎస్ అండగా ఉంటుందని, కవిత గారి మద్దతుతో టీఆర్ఎస్ నాయకులంతా బస్తీ వాసుల తరఫున పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు.
స్థానిక ఎమ్మెల్యే గణేష్ తనను గెలిపిస్తే శాశ్వతంగా పట్టాలు ఇప్పిస్తానని చెప్పి ఇప్పుడు మొఖం చాటేశారని బాధితులు వాపోతున్నారని ఇస్మాయిల్ ఆవేదన వ్యక్తం చేశారు. బస్తీ వాసులకు ఆధార్ కార్డు, కరెంట్ కనెక్షన్, గ్యాస్ బిల్లు వంటి అన్ని గుర్తింపు కార్డులు ఉన్నాయని ఆయన తెలిపారు. పేదల ఇళ్ల జోలికి వస్తే ఊరుకునేది లేదని తెలంగాణ రక్షణ సేన మరోసారి హెచ్చరించింది.










