సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ (ఎస్టీపీపీ)లో విధి నిర్వహణలో ప్రమాదానికి గురై మృతి చెందిన సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (ఏఎస్ఐ) శ్రీ నరహరిసెట్టి అర్జున సారధి కుటుంబానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) రూ.1.10 కోట్ల బీమా క్లెయిమ్ మొత్తాన్ని అందజేసింది.
ఎస్బీఐ తన జీత ఖాతాదారులకు అందించే CAPSP వ్యక్తిగత ప్రమాద బీమా (PAI) మరియు గ్రూప్ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ (GTLI) పథకాల కింద ఈ మొత్తాన్ని మంజూరు చేసింది. మృతుడి భార్య, నామినీ అయిన శ్రీమతి నరహరిసెట్టి గంగాభవానికి ఈ పరిహారాన్ని అందించారు. ఈ మొత్తం ఎస్టీపీపీలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో అందజేశారు.
కార్యక్రమంలో ఎస్బీఐ మంచిర్యాల ప్రాంతీయ మేనేజర్ శ్రీ రితేష్ గుప్తా, సీఎమ్‌డీ వాస్ కిరణ్ కుమార్, CISF ఎస్టీపీపీ యూనిట్ కమాండెంట్ శ్రీ చంచల్ సర్కార్, డిప్యూటీ కమాండెంట్ మందీప్ సింగ్, అసిస్టెంట్ కమాండెంట్ సుదేశ్ జాకర్, ఎస్బీఐ ఎస్టీపీపీ పెగడపల్లి శాఖ మేనేజర్‌తో పాటు CISF అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
అధికారులు మాట్లాడుతూ, ఎస్బీఐ అందించే బీమా, పెట్టుబడి మరియు సామాజిక భద్రతా పథకాలు అత్యవసర పరిస్థితుల్లో కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తాయని తెలిపారు. అర్జున సారధి కుటుంబానికి కేవలం నెల రోజుల వ్యవధిలోనే క్లెయిమ్‌ను పరిష్కరించి పరిహారం అందించడం బ్యాంకు సేవల పట్ల నిబద్ధతకు నిదర్శనమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జీత ఖాతాదారులకు అందుబాటులో ఉన్న వివిధ బీమా, పెట్టుబడి, సామాజిక భద్రతా పథకాలపై అవగాహన కల్పించారు.
క్లెయిమ్ మొత్తాన్ని అందుకున్న శ్రీమతి గంగాభవాని మాట్లాడుతూ, తమ కుటుంబం తీవ్ర విషాదంలో ఉన్న సమయంలో బ్యాంకు అధికారులు వేగంగా స్పందించి, తక్కువ సమయంలోనే బీమా క్లెయిమ్‌ను మంజూరు చేయడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. బ్యాంకు సేవలపై విశ్వాసంతో రూ.1 కోటి మొత్తాన్ని ఒక సంవత్సరం కాలపరిమితితో ఫిక్స్డ్ డిపాజిట్‌గా ఎస్బీఐ ఎస్టీపీపీ పెగడపల్లి శాఖలో జమ చేసినట్లు తెలిపారు.








