జిల్లాలో సాదా బైనమా దరఖాస్తుల పరిష్కారం క్షేత్రస్థాయిలో పరిశీలించి, రికార్డులను అనుసరించి పకడ్బందీగా చేపట్టాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు సూచించారు. శుక్రవారం ఆయన కోటపల్లి, చెన్నూర్ మండలాల తహసిల్దార్ కార్యాలయాలను సందర్శించి పలు అంశాలపై సమీక్షించారు.
జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు శుక్రవారం కోటపల్లి, చెన్నూర్ మండలాల తహసిల్దార్ కార్యాలయాలను సందర్శించి, సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారం, ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం, భూభారతి పెండింగ్ దరఖాస్తులు, భూ సేకరణ సంబంధిత అంశాలపై అధికారులతో సమీక్షించారు.
సాదా బైనమా దరఖాస్తుల పరిష్కారంలో భాగంగా క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి, రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేసి, ప్రభుత్వ ఆదేశాల ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆయన సిబ్బందికి సూచించారు. భూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించడానికి ప్రభుత్వం భూభారతి పోర్టల్ ను అందుబాటులోకి తీసుకువచ్చిందని, దీని ద్వారా నిబంధనల ప్రకారం భూ సంబంధిత సర్వీసులను వేగవంతంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. పెండింగ్ దరఖాస్తుల పరిష్కారాన్ని వేగవంతం చేయాలని ఆదేశించారు.
భూ సేకరణ ప్రక్రియలో భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం విషయంలో నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. కార్యాలయ సిబ్బంది సమయపాలన పాటించాలని, ప్రజలతో స్నేహపూర్వకంగా మెలగాలని, సర్టిఫికెట్లను నిబంధనలకు లోబడి నిర్ణీత గడువులోగా జారీ చేయాలని సూచించారు.
చెన్నూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఓటర్ జాబితా ప్రత్యక్ష సమగ్ర సవరణ కార్యక్రమం - హెల్ప్ డెస్క్ ను సందర్శించి, అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ నెల 25వ తేదీ నుంచి నిర్వహించనున్న ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని, బూత్ స్థాయి అధికారులు ప్రతి ఇంటికి వెళ్లేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.











