రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు, పెద్దపల్లి జోన్ మహిళా పోలీస్ స్టేషన్‌ను పెద్దపల్లి డీసీపీ బి. రామ్ రెడ్డి శుక్రవారం తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితులను కుటుంబ సభ్యులుగా భావించి, ఆత్మీయతతో, మర్యాదపూర్వకంగా సేవలందించాలని ఆయన సిబ్బందికి సూచించారు.
వార్షిక తనిఖీలలో భాగంగా మహిళా పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన డీసీపీ, రిసెప్షన్ కేంద్రాన్ని పరిశీలించి, సిబ్బందితో మాట్లాడారు. బాధితుల సమస్యలను ఎలా స్వీకరిస్తున్నారు, ఫిర్యాదుల పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారనే విషయాలను అడిగి తెలుసుకున్నారు.
స్టేషన్ రికార్డుల నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేసిన డీసీపీ, ఫిర్యాదు నమోదు నుంచి చార్జ్‌షీట్ దాఖలు వరకు అన్ని ప్రక్రియలను ఆన్లైన్లో నమోదు చేయాలని, నిర్ణీత గడువులోగా దర్యాప్తు పూర్తి చేయాలని సూచించారు.
మహిళలకు సంబంధించిన కేసుల వివరాలను, వాటి దర్యాప్తు పురోగతిని సమీక్షించారు. బాధితులకు న్యాయం జరిగేలా కేసుల విచారణను వేగవంతంగా, పారదర్శకంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. కౌన్సెలింగ్ ద్వారా సమస్యలకు పరిష్కారం చూపాలని, భార్యాభర్తల మధ్య విభేదాలను సర్దుబాటు చేసేలా అవగాహన కల్పించాలని సూచించారు.










