మంచేరియల్, 30-06-2026
మూడు దశాబ్దాలకు పైగా పోలీసు శాఖలో క్రమశిక్షణ, నిజాయితీ, అంకితభావంతో సేవలందించి ఉద్యోగ విరమణ పొందుతున్న సిబ్బందికి రామగుండం పోలీస్ కమిషరేట్ ఆధ్వర్యంలో ఘన సన్మానం జరిగింది. అడిషనల్ డీసీపీ (అడ్మిన్) కె. శ్రీనివాస్ వారి సేవలను ప్రశంసిస్తూ జ్ఞాపికలను అందజేశారు.
మూడు దశాబ్దాలకు పైగా పోలీసు శాఖలో క్రమశిక్షణ, నిజాయితీ, అంకితభావంతో సేవలందించి, ఉద్యోగ విరమణ పొందుతున్న పోలీసు సిబ్బందికి రామగుండం పోలీస్ కమిషరేట్ ఆధ్వర్యంలో ఘన సన్మానం జరిగింది. కమిషరేట్ కార్యాలయంలో మంగళవారం జరిగిన ఈ కార్యక్రమంలో ఉద్యోగ విరమణ పొందుతున్న ఎస్ఐలు ఠాకూర్ సహదేవ్ సింగ్, మహమ్మద్ అహ్మదుల్లా, మేకల మహేందర్ రెడ్డి; ఏఎస్ఐలు బోయ శ్రీనివాస్, మహమ్మద్ అమానుల్లా; ఏఆర్ ఎస్ఐ పి. వెంకటేశ్వర్లు; హెడ్ కానిస్టేబుల్ బొట్ల చేరాలులను అడిషనల్ డీసీపీ (అడ్మిన్) కె. శ్రీనివాస్ పూలమాలలు, శాలువాలతో సన్మానించి జ్ఞాపికలను అందజేశారు.
ఈ సందర్భంగా అడిషనల్ డీసీపీ కె. శ్రీనివాస్ మాట్లాడుతూ, పోలీసు ఉద్యోగం కేవలం ఉపాధి మాత్రమే కాదని, ప్రజల భద్రత కోసం వ్యక్తిగత, కుటుంబ సమయాన్ని త్యాగం చేస్తూ నిర్వర్తించే గొప్ప బాధ్యత అని అన్నారు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా ప్రజల రక్షణ కోసం అందించిన సేవలు పోలీసు శాఖ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని పేర్కొన్నారు. వారి అనుభవం, క్రమశిక్షణ, సేవాభావం యువ పోలీసు సిబ్బందికి ఆదర్శంగా నిలుస్తాయని తెలిపారు. విధి నిర్వహణలో సంపాదించిన గౌరవం, ప్రజల విశ్వాసం, మంచి పేరు జీవితంలో అత్యంత విలువైన సంపద అని కొనియాడారు.
ఉద్యోగ విరమణ అనేది సేవా జీవితానికి ముగింపు మాత్రమేనని, జీవితంలో కొత్త అధ్యాయానికి ఆరంభమని పేర్కొన్నారు. ఇకపై కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతూ, ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ, అనుభవాన్ని సమాజానికి మార్గదర్శకంగా అందించాలని ఆకాంక్షించారు. రామగుండం పోలీస్ కమిషరేట్ తరఫున ఉద్యోగ విరమణ పొందుతున్న అధికారులకు, సిబ్బందికి హృదయపూర్వక అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ, వారి సేవలకు పోలీసు శాఖ ఎల్లప్పుడూ రుణపడి ఉంటుందని అన్నారు. పదవీ విరమణ అనంతర జీవితం ఆరోగ్యంగా, ఆనందంగా, సుఖసంతోషాలతో కొనసాగాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ, వారికి, వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో అడ్మిన్ డీసీపీ కె. శ్రీనివాస్, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ నాగేంద్ర గౌడ్, ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్, ఏఆర్ ఏసీపీ రమేష్, సీసీఎస్ ఇన్స్పెక్టర్ గోపి, ఆర్ఐలు దామోదర్, శేఖర్, పెద్దన్న, రమేష్, సీపీఓ సూపరింటెండెంట్లు ఇంద్రసేనారెడ్డి, మనోజ్ కుమార్, సందీప్, సంధ్య, సీసీ హరీష్, ఆర్ఎస్ఐలు వెంకట్, సరిత, పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు పోచలింగం తదితరులు పాల్గొన్నారు.











