మంచేరియల్, 2026-11-23
ప్రజావాణిలో అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, త్వరగా పరిష్కరించేలా అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. సోమవారం నస్పూర్ లోని సమీకృత జిల్లా కార్యాలయాల్లో అదనపు కలెక్టర్లు, ఆర్డీఓతో కలిసి అర్జీదారుల నుండి నేరుగా దరఖాస్తులు స్వీకరించారు.
ప్రజావాణిలో అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, త్వరగా పరిష్కరించే విధంగా అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం, జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్లు పి.చంద్రయ్య, వి.రాములు, జిల్లా రెవెన్యూ అధికారి మోతీరాం లతో కలిసి అర్జీదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. భీమారం మండలం కొత్తగూడెం గ్రామానికి చెందిన గోస్కుల రాజక్క, గోస్కుల ఓదక్క లు తమ కుటుంబానికి వారసత్వంగా వచ్చిన భూమిని, తమ కుటుంబ సభ్యులకు తెలియకుండా జరిగిన పట్టాను రద్దుచేసి ఆదుకోవాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. జైపూర్ మండలం బెజ్జాల గ్రామ సర్పంచ్ స్రవంతి, గ్రామంలోని పెద్ద చెరువు నాలా పూడ్చి వరి పొలం సాగు చేస్తున్న విషయంపై తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. చెన్నూర్ పట్టణానికి చెందిన తిరుపతి మంగ, తన ఇంటికి ప్లింత్ ఏరియా సర్టిఫికెట్ మంజూరు చేయాలని కోరుతూ అర్జీ సమర్పించారు. బెల్లంపల్లి పట్టణం హనుమాన్ బస్తి కి చెందిన వెంకటేష్, తమ కాలనీలో మిషన్ భగీరథ పైప్ లైన్ ఏర్పాటు చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. భీమారం మండలం బూరుగుపల్లి గ్రామానికి చెందిన బానోత్ రాజేశ్వరి, తనకు వారసత్వంగా రావలసిన భూమి వాటా విషయం తేలే వరకు క్రయ, విక్రయాలు జరుపకుండా నిలుపుదల చేయాలని కోరుతూ ధరఖాస్తు సమర్పించారు. మంచిర్యాల పట్టణంలోని 12 వ డివిజన్ కు చెందిన సంగెపు రమ, తనకు ఇందిరమ్మ ఇల్లు ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. చెన్నూర్ మండలం సుద్దాల గ్రామానికి చెందిన గుర్రాల రమేష్ గౌడ్, తనకు గీత కార్మికుల పింఛన్ ఇప్పించాలని కోరుతూ అర్జీ సమర్పించారు. కన్నేపల్లి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన దుర్గం రాజలింగు, తన రేషన్ కార్డు ఫ్రీజ్ లో ఉందని, ఈ విషయమై తనకు న్యాయం చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. మందమర్రి పట్టణానికి చెందిన బొలిశెట్టి మల్లయ్య, తమకు చెందిన భూమిలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇంటి నిర్మాణాన్ని నిలిపివేసి తనకు న్యాయం చేయాలని కోరుతూ అర్జీ సమర్పించారు. భీమిని మండలం కేస్లాపూర్ గ్రామ సర్పంచ్ పోతరాజుల సతీష్, గ్రామ పంచాయితీ నూతన భవన నిర్మాణ పనులను పూర్తిచేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 63 దరఖాస్తులు అందాయని తెలిపారు. ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి, త్వరగా పరిష్కరించే విధంగా అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.







