మంచేరియల్, 2026-07-14
జర్నలిస్ట్ పై జరిగిన దాడిని ఖండిస్తూ, నిందితులపై హత్యాయత్నం కేసు నమోదు చేసి తక్షణమే అరెస్టు చేయాలని పెద్దపల్లి జిల్లా జర్నలిస్టులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం పెద్దపల్లి సీఐ ప్రవీణ్ కుమార్కు వినతిపత్రం అందజేశారు. ఈ దాడి ప్రజాస్వామ్య విలువలపై, భావ ప్రకటన స్వేచ్ఛపై జరిగిన దాడిగా వారు అభివర్ణించారు.
జర్నలిస్ట్ పై జరిగిన దాడి ఘటనలో నిందితులపై హత్యాయత్నం కేసు నమోదు చేసి, వెంటనే అరెస్టు చేయాలని పెద్దపల్లి జిల్లా జర్నలిస్ట్ లు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం పెద్దపల్లి సీఐ ప్రవీణ్ కుమార్కు వినతిపత్రం అందజేశారు.
అనంతరం విలేకరులు మాట్లాడుతూ, జర్నలిస్ట్ పై జరిగిన దాడి కేవలం ఒక వ్యక్తిపై జరిగిన దాడి కాదని, అది ప్రజాస్వామ్య విలువలపై, భావ ప్రకటన స్వేచ్ఛపై, ప్రజలకు నిజమైన సమాచారాన్ని అందించే హక్కుపై జరిగిన దాడిగా అభివర్ణించారు. సమాజంలో జరుగుతున్న విషయాలను నిర్భయంగా ప్రజలకు చేరవేయడం జర్నలిస్ట్ ల బాధ్యత అని, అలాంటి విధులు నిర్వహిస్తున్న పాత్రికేయులపై దాడులు జరగడం అత్యంత దురదృష్టకరమని పేర్కొన్నారు.
దాడికి పాల్పడిన వారిపై చట్టంలోని కఠినమైన సెక్షన్ల కింద, ముఖ్యంగా హత్యాయత్నం కేసు నమోదు చేసి, వెంటనే అరెస్టు చేయాలని వారు పోలీసు అధికారులను కోరారు. నిందితులకు చట్ట ప్రకారం కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
జర్నలిస్ట్ లు ఎలాంటి భయాందోళనలు లేకుండా తమ విధులు నిర్వర్తించేలా ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం భద్రత కల్పించాలని కోరారు. మీడియా స్వేచ్ఛను హరించే ప్రయత్నాలను సహించబోమని స్పష్టం చేశారు. గాయపడిన జర్నలిస్ట్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు గుడ్ల శ్రీనివాస్, ఎస్సీ, ఎస్టీ జర్నలిస్ట్ యూనియన్ వ్యవస్థాపకుడు అరెల్లి మల్లేష్, డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ వర్కింగ్(డీజేఎఫ్డబ్ల్యూ) స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ దార మధు, ప్రవీణ్ రెడ్డి, కాల్వ రమేష్, బందెల రాజశేఖర్, సుధాకర్, సంపత్, రాజు, తిరుపతి, శంకర్, శ్రీనివాస్, జైపాల్, అక్షయ్, శ్రీనివాస్, భాస్కర్, భూమేష్, శ్రీకాంత్ తదితర జర్నలిస్ట్ లు పాల్గొన్నారు.











