మంచేరియల్, 14-07-2026
ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అర్హులకే చేరేలా చూడాలని, ప్రభుత్వ వనరులను అక్రమంగా మళ్లించడం, నిత్యావసర వస్తువుల బ్లాక్ మార్కెటింగ్ వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలను ఉపేక్షించబోమని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో, బండారి మారుతిపై జారీ చేసిన పీడీ ఉత్తర్వులకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
ప్రివెన్షన్ ఆఫ్ బ్లాక్ మార్కెటింగ్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ సప్లై ఆఫ్ ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్–1980 ప్రకారం రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా బండారి మారుతి (తండ్రి: మల్లయ్య) పై జారీ చేసిన నిరోధాత్మక నిర్బంధ (పీడీ) ఉత్తర్వులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు సాధారణ పరిపాలన (ప్రత్యేక శాంతిభద్రతలు) శాఖ జి.ఓ.ఆర్.టి. నెం.1013, తేదీ: 13-07-2026 ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది.
రామగుండం పోలీస్ కమిషనర్ 06-07-2026న జారీ చేసిన పీడీ ఉత్తర్వులను చట్టబద్ధంగా పరిశీలించిన అనంతరం ప్రభుత్వం వాటికి అధికారికంగా ఆమోదం తెలిపింది. దీంతో బండారి మారుతిపై అమలులో ఉన్న నిరోధాత్మక నిర్బంధ ఉత్తర్వులు కొనసాగనున్నాయని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ, ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు నిజమైన లబ్ధిదారులకు, పేద ప్రజలకు చేరేలా చూడడం, ప్రజల ప్రయోజనాలను పరిరక్షించడం, ప్రభుత్వ ఆదాయాన్ని కాపాడడం పోలీస్ శాఖ బాధ్యత అని అన్నారు. ప్రభుత్వ విధానాలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ ప్రభుత్వ వనరులను అక్రమంగా మళ్లించడం, నిత్యావసర వస్తువులను బ్లాక్ మార్కెటింగ్ చేయడం, ప్రభుత్వ ఆదాయానికి నష్టం కలిగించడం, ప్రజలను ఇబ్బందులకు గురిచేసే ఎలాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలనైనా ఉపేక్షించబోమని స్పష్టం చేశారు.
ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా అక్రమ కార్యకలాపాల్లో ప్రమేయం ఉన్న వారందరినీ గుర్తించి, చట్ట పరిధిలో అత్యంత కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే పీడీ చట్టాన్ని కూడా అమలు చేస్తామని తెలిపారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో నకిలీ విత్తనాల అక్రమాలపై కఠిన చర్యల్లో భాగంగా ఇప్పటికే పీడీ చట్టాన్ని అమలు చేశామని పేర్కొన్నారు.
ప్రభుత్వ విధానాలకు విరుద్ధంగా వ్యవహరించి పేద ప్రజల హక్కులకు భంగం కలిగించే, ప్రజల సంక్షేమాన్ని దెబ్బతీసే, ప్రభుత్వ ఆదాయానికి నష్టం కలిగించే, అక్రమ లాభాల కోసం చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులు, ముఠాలు, వ్యాపారులు ఎంతటి వారైనా ఉపేక్షించబోమని, వారిపై చట్టపరమైన కఠిన చర్యలు నిరంతరం కొనసాగుతాయని పోలీస్ కమిషనర్ తెలిపారు.











