మంచేరియల్, జూలై 31, 2026
వర్షాకాలంలో ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని పారిశుద్ధ్య నిర్వహణను పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. శుక్రవారం ఆయన లక్షెట్టిపేట మున్సిపల్ పరిధిలోని 5వ వార్డులో పారిశుద్ధ్య పనులను పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
వర్షాకాలంలో ప్రజల ఆరోగ్యం దృష్ట్యా పారిశుద్ధ్య నిర్వహణను పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం జిల్లాలోని లక్షెట్టిపేట మున్సిపల్ పరిధిలోని 5వ వార్డులో మండల తహసిల్దార్ దిలీప్ కుమార్, మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్ లతో కలిసి పారిశుద్ధ్య నిర్వహణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతిరోజు చెత్త సేకరణ, అంతర్గత రహదారులు, మురుగు కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రపరచాలని, వ్యక్తిగత పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని, త్రాగునీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చూడాలని తెలిపారు.
మండలంలోని పాతకొమ్ముగూడెం గ్రామంలోని చెరువును మండల పరిషత్ అభివృద్ధి అధికారి మధుసూదన్ తో కలిసి పరిశీలించారు. చెరువు పరిస్థితి, నీటి నిల్వలు తదితర అంశాలపై సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వెంకట్రావుపేట గ్రామంలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి, ఆసుపత్రిలోని వార్డులు, మందుల నిల్వలు, రిజిస్టర్లను పరిశీలించారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, సిబ్బంది హాజరు, పారిశుద్ధ్య నిర్వహణ తదితర అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
గ్రామంలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. లబ్ధిదారులు తమ ఇండ్లను నిర్ణీత విస్తీర్ణంలో త్వరగా నిర్మించుకునే విధంగా అధికారులు అవగాహన కల్పించాలని, నిర్మాణ పనులను వేగవంతం చేయాలని సూచించారు. మండల కేంద్రంలోని 30 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి వైద్యులు, సిబ్బంది హాజరు, పారిశుద్ధ్య నిర్వహణ, ఓ.పి., ల్యాబ్, మందుల నిల్వలు, పరిసరాలను పరిశీలించారు. ఆసుపత్రికి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, వర్షాకాలం దృష్ట్యా అవసరమైన మందులను అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. వైద్యులు, సిబ్బంది విధుల పట్ల సమయపాలన పాటించాలని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వైద్య సేవలు అందించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.











