మంచేరియల్, 2026-07-14
బాల కార్మికులు, వీధి బాలలు, ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న చిన్నారులను గుర్తించి రక్షించేందుకు 'ఆపరేషన్ ముస్కాన్' కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. మంగళవారం నస్పూర్ సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో నిర్వహించిన జిల్లా స్థాయి సమీక్ష సమావేశంలో ఈ మేరకు సూచనలు చేశారు.
జిల్లాలో ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేసి, బాల కార్మికులు, వీధి బాలలు, ప్రమాదకర పరిస్థితులలో ఉన్న చిన్నారులను గుర్తించి తక్షణమే రక్షించేలా అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని కలెక్టర్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి సమీక్ష సమావేశానికి జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి. చంద్రయ్య, డి.సి.పి. ఎ.భాస్కర్, జిల్లా సంక్షేమ శాఖ అధికారి రౌఫ్ ఖాన్ లతో కలిసి హాజరయ్యారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని హోటళ్లు, దాబాలు, టీ స్టాళ్లు, గ్యారేజీలు, వర్క్‌షాపులు, పరిశ్రమలు, ఇటుక బట్టీలు, నిర్మాణ పనులు, షాపింగ్ సముదాయాలు, వ్యవసాయ క్షేత్రాలు తదితర ప్రాంతాలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి బాల కార్మికులను గుర్తించి వెంటనే రక్షించాలని అధికారులను ఆదేశించారు. రక్షించిన ప్రతి చిన్నారికి వైద్య పరీక్షలు, కౌన్సిలింగ్, విద్యలో పునఃప్రవేశం, కుటుంబ పునరావాసం / అవసరమైతే బాలల సంరక్షణ సంస్థలలో ఆశ్రయం కల్పించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
బాల కార్మికులను పనిలో పెట్టుకునే యజమానులు, చిన్నారులను దుర్వినియోగం చేసే వ్యక్తులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే ఎఫ్ఐఆర్ నమోదు చేసి నేరపూరిత చర్యలను అరికట్టాలని పోలీసు శాఖకు సూచించారు. బాలల హక్కుల పరిరక్షణలో ఎటువంటి నిర్లక్ష్యాన్ని సహించేది లేదని తెలిపారు. ఆపరేషన్ ముస్కాన్–XII లక్ష్యాల సాధనకు అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పని చేయాలని, ప్రతి రెస్క్యూ చర్యను పకడ్బందీగా నమోదు చేసి, సంబంధిత శాఖలకు సకాలంలో నివేదికలు సమర్పించాలని తెలిపారు.
అన్ని శాఖల అధికారులు గ్రామాలు, పట్టణాలు, విద్యాసంస్థలు, వ్యాపార సంస్థలలో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించి బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, బాలల హక్కుల పరిరక్షణపై ప్రజలలో చైతన్యం కల్పించాలని, బాలల రక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అనే సందేశాన్ని ప్రజలలోకి తీసుకెళ్లాలని తెలిపారు.
డి.సి.పి. మాట్లాడుతూ బాలల అక్రమ రవాణా, బాల కార్మిక వ్యవస్థ, బాలలపై జరుగుతున్న దోపిడీ వంటి అంశాలపై ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నామని తెలిపారు. చట్టాన్ని ఉల్లంఘించే వారిపై రాజీ పడకుండా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పోలీసు, కార్మిక, విద్యా, వైద్య ఆరోగ్య, రెవెన్యూ శాఖల అధికారులు, జిల్లా బాలల పరిరక్షణ యూనిట్, చైల్డ్ హెల్ప్‌లైన్ అధికారులు, సంబంధిత శాఖల అధికారులు హాజరయ్యారు.












