మంచేరియల్, జూలై 14, 2026
జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ – సెర్ప్ ఆధ్వర్యంలో అమలవుతున్న సంక్షేమ, ఉపాధి కల్పన కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసి, ప్రభుత్వ లక్ష్యాలను చేరుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య సూచించారు. నస్పూర్ లోని సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో మంగళవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన ఈ ఆదేశాలు జారీ చేశారు.
జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ – సెర్ప్ ఆధ్వర్యంలో అమలవుతున్న సంక్షేమ, ఉపాధి కల్పన కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా అమలు చేసి, ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య అన్నారు. మంగళవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ – సెర్ప్ కార్యక్రమాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాల సభ్యులు కాని మహిళలకు యూనిఫాం చీరలు పంపిణీ చేసినట్లయితే, వారిని గుర్తించి వెంటనే సంబంధిత స్వయం సహాయక సంఘాలలో సభ్యులుగా చేర్పించాలని తెలిపారు. స్త్రీ నిధి బ్యాంక్ లింకేజీ కార్యక్రమానికి ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను 100 శాతం పూర్తి చేయాలని, రుణాల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించి నిరర్థక ఆస్తులు సున్నా స్థాయిలో ఉండేలా కార్యాచరణ రూపొందించాలని తెలిపారు.
అన్ని రకాల పొదుపు, రుణ కార్యకలాపాలను నిర్దేశిత మార్గదర్శకాల ప్రకారం పారదర్శకంగా, క్రమబద్ధంగా నిర్వహించాలని, గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక రూపకల్పనలో సెర్ప్ సిబ్బంది భాగస్వాములు కావాలని తెలిపారు. ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ సంస్థల అధికారికీకరణ పథకం క్రింద ప్రతి కమ్యూనిటీ కో-ఆర్డినేటర్ కనీసం ఇద్దరు అర్హులైన లబ్ధిదారులను గుర్తించి, యూనిట్ల స్థాపనకు అవసరమైన చర్యలు చేపట్టాలని తెలిపారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని కార్యక్రమాలను నాణ్యతతో, నిర్దేశిత గడువులోగా పూర్తి చేసి, ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రతి అధికారి, సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేయాలని తెలిపారు.
ఈ సమావేశంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ–సెర్ప్ అధికారులు, అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్లు, కమ్యూనిటీ కో-ఆర్డినేటర్లు, సెర్ప్ సిబ్బంది పాల్గొన్నారు.












