మక్తల్, 28-07-2026
మక్తల్ నియోజకవర్గంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు మంత్రి వాకిటి శ్రీహరి బూత్ లెవల్ ఏజెంట్లతో (BLA) సమీక్ష నిర్వహించారు. ఓటరు జాబితా సవరణలో అప్రమత్తంగా పనిచేయాలని, అర్హుల పేర్లు చేర్చాలని, అనర్హులను తొలగించాలని సూచించారు. ఓటు హక్కు కోల్పోతే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు.
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు మంత్రి వాకిటి శ్రీహరి మక్తల్ లోని క్యాంపు కార్యాలయంలో బూత్ లెవల్ ఏజెంట్లు (BLA)లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో ప్రతి అర్హుడైన ఓటరు పేరు జాబితాలో ఉండేలా, అనర్హుల పేర్లను నిబంధనల ప్రకారం తొలగించేలా BLAలు క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా పనిచేయాలని సూచించారు.
బీ ఎల్ ఏ లు ఇంటింటి పరిశీలన చేపట్టి, అవసరమైన దరఖాస్తులను సకాలంలో సమర్పించాలని తెలిపారు. ఓటరు జాబితా పారదర్శకంగా, తప్పులు లేకుండా రూపొందించడంలో BLAల పాత్ర ఎంతో కీలకమని మంత్రి పేర్కొన్నారు. ప్రజలకు అవగాహన కల్పిస్తూ అర్హుడైన ప్రతీ ఓటరుకు న్యాయం జరిగేలా కృషి చేయాలని సూచించారు.
సీఎం నియోజకవర్గం తర్వాత మక్తల్ నియోజకవర్గం అభివృద్ధిలో ముందంజలో ఉందని, రోడ్లు, వంతెనలు, ఇందిరమ్మ ఇండ్ల వంటి అనేక సంక్షేమ పథకాల్లో మక్తల్ నియోజకవర్గం అగ్రగామిగా ఉందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కృషితోనే మొన్న జరిగిన ఎన్నికల్లో మెజారిటీ సర్పంచ్లను, నియోజకవర్గంలోని 3 మున్సిపాలిటీలను గెలిచామని గుర్తు చేశారు. ప్రస్తుతం కేవలం ఒక్క మక్తల్ నియోజకవర్గంలోనే 1890 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని మంత్రి పేర్కొన్నారు.
ఓటర్ సవరణ ప్రక్రియ ప్రతీ సారీ జరిగేదే అయినప్పటికీ, ఈ సారి జరిగే SIR కు చాలా ప్రాముఖ్యత ఉందని, ఓటర్లు అప్రమత్తంగా లేకుంటే ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉందని అన్నారు. వెస్ట్ బెంగాల్లో మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల ముందు 90 లక్షల ఓట్లు గల్లంతు అయ్యాయని ఈ సందర్భంగా మంత్రి BLAలకు గుర్తు చేశారు.
ఈ దేశంలో ఉన్న పేదోడు ఏ కారణం చేత కూడా ఓటు హక్కు కోల్పోరాదు అనేది కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతమని, ప్రతీ వ్యక్తి ఓటు హక్కు కాపాడే బాధ్యత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తదని స్పష్టం చేశారు. ఓటు ఉందా లేదా చూసుకోకపోతే భవిష్యత్ లో చాలా ఇబ్బందులు వస్తాయని మంత్రి తెలియజేశారు. నియోజకవర్గంలోని 7 మండలాలు, 3 మున్సిపాలిటీల్లోని పార్టీ అధ్యక్షులు, నాయకులు ఓటర్ సవరణ ప్రక్రియపై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రతీ ఒక్క బూత్ లెవెల్ ఏజెంట్ లు ఈ చివరి 6 రోజులు కష్టపడి పని చేయాలని పిలుపునిచ్చారు. ఓటర్ లిస్ట్ మీద గ్రామ నాయకులకు పట్టు ఉండాలన్నారు. మనందరం ప్రజా జీవితంలో ఉన్నాము కాబట్టి అందరి ఓటు హక్కు కాపాడటం నాయకుల లక్షణం అని అన్నారు.
మక్తల్ కు మొదటి ఎమ్మెల్యే శాంతాబాయి నుండి మొదలుకొని ఇప్పటి వరకు ఈ 72 ఏండ్లలో ఈ నియోజకవర్గానికి 398 కోట్లు రాగా, తాను వచ్చిన ఈ రెన్నర ఏళ్లలో 1890 కోట్లు మక్తల్ అభివృద్ధికి తీసుకొచ్చానని మంత్రి వెల్లడించారు. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఉమ్మడి పాలమూరు జిల్లాలో 21 అసెంబ్లీ నియోజకవర్గాలు, 3 పార్లమెంట్ లు అవుతాయని, వచ్చే ఎన్నికల్లో 21కి 21 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.












