మంచిర్యాల జిల్లా మందమర్రి మండలంలోని బొక్కలగుట్ట గ్రామంలో గత ఏడాది భారీ వర్షాలకు తెగిపోయిన మేడి చెరువు పునర్నిర్మాణ పనులు అటవీశాఖ అభ్యంతరాల కారణంగా నిలిచిపోయాయని, దీంతో ఆయకట్టు రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా పనులు ప్రారంభం కాకపోవడంతో రైతులు ప్రభుత్వాన్ని ఆశ్రయించారు.
గత సంవత్సరం కురిసిన అకాల వర్షాల వల్ల మేడి చెరువు తెగిపోవడంతో, తూము, కట్ట కొట్టుకుపోయాయి. ఈ నేపథ్యంలో, కార్మికశాఖ & మైనింగ్ శాఖ మంత్రి డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లగా, ఆయన స్పందించి పునర్నిర్మాణం కోసం రూ. 14,80,000 నిధులను మంజూరు చేశారు. గత డిసెంబర్లో టెండర్లు పిలిచి, పనులు అప్పగించేందుకు అనుమతులు కూడా జారీ అయ్యాయి.
అయితే, మార్చి నెలలో పూర్తి కావాల్సిన పనులు ఇప్పటివరకు ప్రారంభం కాలేదని రైతులు తెలిపారు. గుత్తాదారును సంప్రదించగా, అటవీశాఖ అధికారులు పనులకు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారని సమాధానం వచ్చినట్లు తెలిసింది. దీనితో రైతులు ఆందోళనకు గురయ్యారు.
వందల ఏళ్ల క్రితం నిర్మించిన ఈ చెరువు, సుమారు 500 ఎకరాల ఆయకట్టుకు జీవనాధారమని, గ్రామం మొత్తం వ్యవసాయంపై ఆధారపడి ఉందని రైతులు వివరించారు. చెరువు పనులు సకాలంలో పూర్తి కాకపోతే వన్యప్రాణులకు నీటి కరువు ఏర్పడటమే కాకుండా, వ్యవసాయ భూములు బీడుభూములుగా మారే ప్రమాదం ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
కావున, మంత్రి వివేక్ వెంకటస్వామి, జిల్లా కలెక్టర్, అటవీశాఖ, ఇరిగేషన్ అధికారులు తక్షణమే స్పందించి, మేడి చెరువు పనులను వేగవంతం చేసి, తమను ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్, వార్డు సభ్యులు, ఆయకట్టు రైతులు పాల్గొన్నారు.









