కొనుగోలు చేసిన వరి ధాన్యాన్ని రైస్ మిల్లులు, గోదాములకు సకాలంలో తరలించి, దిగుమతి ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు అధికారులను, రైస్ మిల్లర్లను ఆదేశించారు. బుధవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ మేరకు సూచనలు జారీ చేశారు.
జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో పౌర సరఫరాల శాఖ, గ్రామీణ అభివృద్ధి, రవాణా, కార్మిక శాఖల అధికారులతో పాటు రైస్ మిల్లర్ల అసోసియేషన్ ప్రతినిధులు, రవాణా గుత్తేదారులతో జరిగిన సమావేశంలో అదనపు కలెక్టర్ వి.రాములు మాట్లాడుతూ, రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తోందని, ఈ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వరాదని స్పష్టం చేశారు.
ప్రతిరోజూ కనీసం 6 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని, 10-15 లారీల ధాన్యాన్ని రోజుకు దిగుమతి చేసుకోవాలని, అవసరమైతే హమాలీల సంఖ్యను పెంచుకోవాలని సూచించారు. కొనుగోలు, దిగుమతి ప్రక్రియ అనుసంధానంగా జరగాలని, రవాణా శాఖ లారీలను సమకూర్చడంలో సహకరిస్తుందని, రైస్ మిల్లుల యజమానులు దిగుమతి ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు.
అటవీ చెక్ పోస్టుల వద్ద ధాన్యం తరలిస్తున్న లారీలను ఆపకుండా చర్యలు తీసుకోవాలని, డ్రైవర్లు, సిబ్బందికి రైస్ మిల్లుల వద్ద త్రాగునీరు, ఇతర సౌకర్యాలు కల్పించాలని తెలిపారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ట్యాబ్లో నమోదు చేయాలని, తడిసిన ధాన్యాన్ని కేటాయించిన మిల్లులకే పంపాలని, ప్రక్రియ సజావుగా సాగేందుకు అధికారులకు సహకరించాలని రైస్ మిల్లర్లను కోరారు.
సమావేశం అనంతరం లక్షెట్టిపేట మండలంలోని గుల్లకోట, మిట్టపల్లి గ్రామాల్లోని రైస్ మిల్లులను, దండేపల్లి మండలంలోని లింగాపూర్ లో గోదాముగా మార్చిన రైస్ మిల్లును సంబంధిత అధికారులు సందర్శించి, ప్రభుత్వ నిబంధనల ప్రకారం ధాన్యం దిగుమతి చేసుకోవాలని ఆదేశించారు.








