మంచిర్యాల జిల్లాలో ధాన్యం దిగుమతి ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి. రాములు ఆదేశించారు. మంగళవారం ఆయన జిల్లాలోని జైపూర్ మండలం ఇందారం, రామారావుపేటలో గల సుముఖ గోదాములను సందర్శించి, గోదాం నిర్వాహకులకు పలు సూచనలు చేశారు.
ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించిన ధాన్యాన్ని రైస్ మిల్లులు, గోదాములకు తరలించే ప్రక్రియను వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ సూచించారు. గోదాముల వద్ద వేచి ఉన్న లారీల నుంచి ధాన్యం దిగుమతి ప్రక్రియలో జాప్యం జరగకుండా చూడాలని ఆయన స్పష్టం చేశారు.
రైస్ మిల్లులు, గోదాములకు తరలించబడిన ధాన్యం దిగుమతి ప్రక్రియను వేగవంతం చేయాలని, రోజుకు కనీసం 50 లారీల నుంచి ధాన్యం దిగుమతి జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. ఇది ప్రభుత్వ లక్ష్యమని, ఈ విషయంలో ఎటువంటి రాజీ పడకూడదని ఆయన పేర్కొన్నారు.
ధాన్యం దిగుమతికి అవసరమైన హమాలీలను సమకూర్చడం జరిగిందని, ఈ ప్రక్రియ త్వరితగతిన పూర్తయ్యేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ విషయంలో నిర్లక్ష్యం వహించవద్దని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.








