మంచేరియల్, 2026-06-05
మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు నివాసంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో, పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్, ఉచిత శిక్షణ, భోజన పథకాలపై కీలక ప్రకటనలు చేశారు. నిరుద్యోగులకు శుభవార్తగా 7,437 పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో ఈ ప్రకటనలు వెలువడ్డాయి.
మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు నివాసంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి కొక్కిరాల సురేఖ గారు పాల్గొన్నారు.
పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు జూలై నెలలో నిరుద్యోగులకు శుభవార్త తెలుపుతూ 7,437 పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్లను విడుదల చేశారని తెలిపారు. ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లాకు చెందిన యువత పోలీస్ ఉద్యోగాలకు దరఖాస్తుల ప్రక్రియ కోసం రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ నాగార్జున గారు ఈనెల 16వ తేదీలోపు దరఖాస్తు ఫారాలను పూర్తి చేసుకోవాలని సూచించారు.
ఉచిత శిక్షణ, భోజన సదుపాయం
పోలీస్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న యువతకు మంచిర్యాల పట్టణంలోని వెంకటేశ్వర్లు థియేటర్ చౌరస్తా వద్ద ఉన్న టీటీడీ మండపంలో ఆగస్టు 20వ తేదీ స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి రోజు నుంచి, కీర్తిశేషులు శ్రీ కొక్కిరాల రఘుపతి రావు గారి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఉచిత శిక్షణ తరగతులు, పుస్తకాలు, ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజన సదుపాయం కల్పిస్తామని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అన్నారు. రెండు నెలల పాటు శిక్షణ కొనసాగుతుందని తెలిపారు.
సెంట్రలైజ్డ్ కిచెన్ నిర్మాణం
అదేవిధంగా మంచిర్యాల కాలేజీ రోడ్డులోని పాత వ్యవసాయ మార్కెట్ యార్డులో మంచిర్యాల జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు టిఫిన్, మధ్యాహ్న భోజనం అందించేందుకు హరే కృష్ణ మూవ్మెంట్ చారిటబుల్ ట్రస్ట్ (ఇస్కాన్ సంస్థ) ఆధ్వర్యంలో సెంట్రలైజ్డ్ కిచెన్ నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని తెలిపారు.
ముఖ్యమంత్రికి, ఉపముఖ్యమంత్రికి ధన్యవాదాలు
విద్యార్థుల కోసం ఇంత మంచి కార్యక్రమాన్ని మంచిర్యాల నియోజకవర్గానికి ఇచ్చినందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, ఉపముఖ్యమంత్రి వర్యులు శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. తొలుత టిఫిన్ పంపిణీ జరుగుతుందని, ఆ తర్వాత దసరా వరకు మధ్యాహ్న భోజనం పంపిణీ ఉంటుందని తెలిపారు. దసరా తర్వాత చెన్నూర్ లో అమలు చేస్తారని చెప్పారు. ప్రభుత్వ హాస్టళ్ల విద్యార్థులకు మినహా, పాఠశాల, జూనియర్ కళాశాల విద్యార్థులకు ఈ భోజనం, టిఫిన్ పథకం వర్తిస్తుందని తెలిపారు.












