మంచేరియల్, జూలై 31, 2026
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా చేపట్టిన ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. శుక్రవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన ఈ సూచనలు చేశారు. ఈ ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులకు, రాజకీయ పార్టీల ప్రతినిధులకు సూచించారు.
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా చేపట్టిన ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. శుక్రవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని కలెక్టర్ సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్లు పి.చంద్రయ్య, వి.రాములు లతో కలిసి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ, ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్, పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా సేకరించిన ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియను నిర్ణీత గడువు కంటే ముందుగానే పూర్తి చేసే విధంగా అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు సమన్వయంతో కృషి చేయాలని సూచించారు. జిల్లాలో అనామోలీస్ ఎక్కువగా ఉన్నాయని, ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత సంబంధిత ఓటర్లకు నోటీసులు జారీ చేయడం జరుగుతుందని తెలిపారు. నోటీసుల విషయంలో ఓటర్లు కంగారు పడవలసిన అవసరం లేదని, నోటీసులో పేర్కొన్న ధ్రువపత్రాలను సమర్పించడం ద్వారా ఓటు హక్కును పొందవచ్చని భరోసా ఇచ్చారు.
డబుల్, డెత్, షిఫ్ట్ అయిన వారి ఓట్లను నిబంధనల ప్రకారం తొలగించడం జరుగుతుందని, ఇంకా ఎన్యూమరేషన్ ఫారాలు అందించని వారిని గుర్తించి, బూత్ స్థాయి ఏజెంట్ల ద్వారా ఫారాలను బూత్ స్థాయి అధికారులకు సమర్పించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డిజిటలైజేషన్ పూర్తయిన తర్వాత పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ చేయడం జరుగుతుందని తెలిపారు. పోలింగ్ కేంద్రాల హేతుబద్దీకరణలో భాగంగా ఒక పోలింగ్ కేంద్రంలో 1,200 ఓటర్లకు మించకుండా ఉండేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ఒక కుటుంబంలోని ఓటర్లందరూ ఒకే పోలింగ్ కేంద్రంలో ఓటు కలిగి ఉండేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని వివరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి మోతిరాం, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ చంద్రకళ, ఎన్నికల విభాగం అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.











