ప్రభుత్వ విద్యా సంస్థలలో చేపట్టిన నిర్మాణ అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన జైపూర్ మండలం గంగిపల్లి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రం, మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి నిర్మాణ పనులను పరిశీలించారు.
కలెక్టర్ గంగిపల్లి పాఠశాలలో అదనపు గదులు, మూత్రశాలల నిర్మాణాలను, అంగన్వాడీ కేంద్రం, కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో అదనపు గదులు, భోజనశాల నిర్మాణ పనులను మండల పరిషత్ అభివృద్ధి అధికారి సత్యనారాయణతో కలిసి సమీక్షించారు. నిర్మాణ పనులను వేగవంతం చేసి నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు.
గంగిపల్లి పాఠశాల ఆవరణలో నిర్మాణంలో ఉన్న మూత్రశాలలను కొందరు తొలగిస్తున్నారనే సమాచారంపై స్పందిస్తూ, బాధ్యులపై చట్ట ప్రకారం కేసు నమోదు చేయాలని ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి పిల్లలకు అందిస్తున్న సౌకర్యాలు, మెనూను పరిశీలించి, మూత్రశాలల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని సూచించారు.
కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాల్లో కొనసాగుతున్న వసతి గృహ అదనపు తరగతి గదులు, భోజనశాల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని, వంటశాలలో పరిశుభ్రత పాటించాలని, విద్యార్థులకు మెనూ ప్రకారం పౌష్టిక ఆహారం అందించాలని తెలిపారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో త్రాగునీరు, విద్యుత్, విద్యార్థిని విద్యార్థులకు వేరువేరుగా మూత్రశాలలు, ప్రహరీ గోడ, అదనపు గదులతో పాటు అన్ని సదుపాయాలు కల్పించి నాణ్యమైన విద్య అందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కలెక్టర్ పేర్కొన్నారు.
అనంతరం విద్యార్థులకు నోటు పుస్తకాలు, దుప్పట్లను పంపిణీ చేశారు. హాజీపూర్ మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో వంటశాలలో ఆహార తయారీ సమయంలో పరిశుభ్రత పాటించాలని, నిత్యావసర సరుకులను క్రమపద్ధతిలో నిల్వ చేసుకోవాలని సిబ్బందికి సూచనలు చేశారు. మండల తహసిల్దార్ కార్యాలయాన్ని సందర్శించి రికార్డులను తనిఖీ చేసి, అధికారులు, సిబ్బంది సమయపాలన పాటించాలని, ప్రజలకు జవాబుదారీగా వ్యవహరించాలని సూచించారు. భూభారతి రెవెన్యూ సదస్సులలో అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి, త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. మండల వ్యవసాయ అధికారితో మాట్లాడుతూ, రైతులకు పంట మార్పిడి, భూసారం పెంపుదల, పంట సాగులో మెలకువలపై అవగాహన కల్పించాలని సూచించారు. ముల్కల్ల ఇసుక రీచ్ ను సందర్శించి, ఇసుక తరలింపు ప్రక్రియను పరిశీలించారు. మన ఇసుక వాహనం యాప్ ద్వారా బుక్ చేసుకున్న వారికి మాత్రమే ఇసుక తరలించాలని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఓటీపీ లేని ట్రాక్టర్ బయటకు వెళ్లకూడదని ఆదేశించారు.












