ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన వాల్మీకి రామాయణం, ఆదివాసి బిడ్డ కొమరం భీమ్ పోరాట స్ఫూర్తి భారత ప్రజలకు ఆదర్శమని భారతీయ జనతా పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర గౌడ్ అన్నారు. మంచిర్యాల జిల్లా కార్యాలయంలో వాల్మీకి మహర్షి జయంతి, కొమరం భీమ్ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి.
భారతీయ జనతా పార్టీ మంచిర్యాల జిల్లా కార్యాలయంలో ఎస్సీ, ఎస్టీ మోర్చాల ఆధ్వర్యంలో రామాయణ మహా కావ్య రచయిత వాల్మీకి మహర్షి జయంతి మరియు తెలంగాణ ఆదివాసీల పోరాట బిడ్డ కొమరం భీమ్ గారి వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర గౌడ్ చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా నగునూరి వెంకటేశ్వర గౌడ్ మాట్లాడుతూ, బహుజన వర్గాల్లో పుట్టి రామాయణాన్ని రచించి భారతదేశంలో చరిత్ర సృష్టించిన వ్యక్తి వాల్మీకి మహర్షి అని కొనియాడారు. ఎస్సీ, ఎస్టీ గురువులు సమాజాన్ని శాసించారని, వారికి నివాళులర్పిస్తున్నామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో జల్ జంగల్ జమీన్ కోసం పోరాడిన ఆదివాసి పోరాట యోధుడు కొమరం భీమ్, ఆదివాసీలకు హక్కులు సాధించేవరకు పోరాడారని, చరిత్రలో ఆయన చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు. బ్రిటిష్ సామ్రాజ్యానికి ఎదురొడ్డి పోరాడిన ఆయన తెగువ ఆదివాసి బిడ్డలలో ఉందని, ఇలాంటి గొప్ప వ్యక్తులను స్మరించుకోవడం ఆనందదాయకమని, వారి అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చారు.
బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దుర్గం అశోక్ మాట్లాడుతూ, బోయ కుటుంబంలో జన్మించిన వాల్మీకి రామాయణం రచించి గొప్ప వ్యక్తిగా కీర్తి గడించారని తెలిపారు. ఆదివాసి బిడ్డగా కొమరం భీమ్ జల్ జంగల్ జమీన్ కోసం పోరాడి, ఆదివాసి హక్కుల కోసం బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎదిరించి నిలిచిన వ్యక్తిగా ఆయనను కొనియాడారు. చరిత్రలో వీరు ఇరువురు చిరస్థాయిగా నిలిచిపోతారని, పోరాటాలకు పుట్టిన గడ్డ ఆదిలాబాద్ జిల్లా అని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో బిజెపి తెలంగాణ రాష్ట్ర మీడియా ప్యానల్ లిస్ట్ తుల ఆంజనేయులు, జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణమూర్తి, జిల్లా ఉపాధ్యక్షులు వెంకటకృష్ణ, జిల్లా అధికార ప్రతినిధి రాకేష్ రెన్వా, ఎస్టి మోర్చా అధ్యక్షులు ప్రేమ్ సింగ్, మండల అధ్యక్షులు రాజ్ కుమార్, శ్రీశైలం, ఎస్సీ మోర్చా నాయకులు రాజన్న, వెంకటేష్, పవన్, బీసీ మోర్చా ఉపాధ్యక్షులు హరికృష్ణ, మంత్రి రామన్న, కాసేటి నాగేశ్వరరావు మరియు బిజెపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.








