ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణతో పాటు శాంతిభద్రతలను పరిరక్షించడమే పోలీసుల ప్రధాన బాధ్యత అని, పోలీసు అమరవీరుల త్యాగాలు దేశ ప్రజలకు ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, ఐపీఎస్ తెలిపారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలోని అమరవీరుల స్థూపం వద్ద బుధవారం పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గత ఏడాది నుంచి ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన 154 మంది పోలీసు అమరవీరుల పేర్లను అడిషనల్ డీసీపీ (అడ్మిన్) శ్రీనివాస్ చదివి వినిపించారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, పెద్దపల్లి డీసీపీ బి.రామ్ రెడ్డి, ఆర్జీ-1 జీఎం లలిత్ కుమార్, ఇతర పోలీసు అధికారులు, అమరవీరుల కుటుంబ సభ్యులతో కలిసి అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. అనంతరం ఆర్ఐ శేఖర్ ఆధ్వర్యంలో సాయుధ పోలీసులు శోకశస్త్రం నిర్వహించారు. పోలీసు అధికారులు, సిబ్బంది, అమరవీరుల కుటుంబ సభ్యులు రెండు నిమిషాలు మౌనం పాటించి అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. ప్రజల ప్రాణాలు, ఆస్తులను రక్షించడం, శాంతిభద్రతలను కాపాడటం, అంతర్గత భద్రతను పరిరక్షించడం పోలీసు శాఖ ప్రధాన బాధ్యతలని తెలిపారు. ఎలాంటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా ప్రజలకు రక్షణ కల్పించడంలో పోలీసులు ముందుండాలని, ప్రతి అధికారి, సిబ్బంది తమకు అప్పగించిన బాధ్యతలను నిబద్ధత, నిజాయితీ, అంకితభావంతో నిర్వర్తించాలని సూచించారు. పోలీసు శాఖపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ క్రమశిక్షణ, బాధ్యత, సేవాభావంతో విధులు కొనసాగించాలని అన్నారు. అమరవీరులు చూపిన ధైర్యం, త్యాగం, దేశభక్తి ప్రతి పోలీసు అధికారి, సిబ్బందికి నిరంతరం స్ఫూర్తినివ్వాలని, దేశ రక్షణ కోసం, ప్రజల భద్రత కోసం తమ ప్రాణాలను అర్పించిన పోలీసు అమరవీరులందరికీ హృదయపూర్వక నివాళులు అర్పిస్తున్నట్లు పోలీస్ కమిషనర్ తెలిపారు.
మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ... విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీసు అమరవీరులను స్మరించుకోవడం, వారి త్యాగాలను గుర్తుచేసుకోవడం కోసం ప్రతి సంవత్సరం పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. దేశ సరిహద్దులను విదేశీ దురాక్రమణల నుంచి రక్షించే బాధ్యతను సైన్యం, నౌకాదళం, వాయుసేన నిర్వహిస్తుండగా, దేశ అంతర్గత భద్రత, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసు శాఖ కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. రాష్ట్ర పోలీసు బలగాలతో పాటు రిజర్వ్ పోలీసు, పారా మిలటరీ బలగాలు కూడా అంతర్గత భద్రతలో ముఖ్యమైన బాధ్యతలను నిర్వహిస్తున్నాయని తెలిపారు. దేశ సరిహద్దుల రక్షణ ఎంత ముఖ్యమో, దేశంలో అంతర్గతంగా తలెత్తే వివాదాలు, అసాంఘిక కార్యకలాపాల నుంచి ప్రజలను రక్షించడం కూడా అంతే ముఖ్యమని అన్నారు. సమాజంలో శాంతి, సామరస్యం నెలకొన్నప్పుడే సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. పోలీసుల విధులు అత్యంత బాధ్యతాయుతమైనవని, వారు 24 గంటలు, సంవత్సరంలో 365 రోజులు ప్రజల రక్షణ కోసం నిరంతరం పనిచేస్తారని తెలిపారు. ఈ క్రమంలో కొందరు పోలీసులు తమ ప్రాణాలను సైతం త్యాగం చేస్తున్నారని, వారి సేవలను, త్యాగాలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని కోరారు.
పోలీసు శాఖకు సహకరించాలనుకునే ప్రతి పౌరుడు చట్టాలను గౌరవించి, నిబంధనలను పాటించాలని, ముఖ్యంగా ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా అనుసరించాలని సూచించారు. నిబంధనలు ప్రజలను భయపెట్టడానికి కాకుండా వారి భద్రత, సమాజ శ్రేయస్సు కోసం రూపొందించబడ్డాయని తెలిపారు. భయంతో కాకుండా పౌర బాధ్యత, సామాజిక స్పృహతో ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటిస్తే సమస్యలు తగ్గి, మెరుగైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని అన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసు శాఖ అంకితభావంతో పనిచేస్తూ సమాజంలో శాంతి, సామరస్యాలను కాపాడుతోందని ప్రశంసించారు. పోలీసుల కృషి వల్ల రాష్ట్రంతో పాటు జిల్లాలో కూడా అభివృద్ధికి అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుందని పేర్కొంటూ, పోలీసు అమరవీరుల త్యాగాలకు మరోసారి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి డీసీపీ బి. రామ్ రెడ్డి, అడిషనల్ డీసీపీ (అడ్మిన్) కె. శ్రీనివాస్, గోదావరిఖని ఏసీపీ ఎం. రమేష్, ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్, టాస్క్ ఫోర్స్ ఏసీపీ శ్రీనివాస్, సీసీఎస్ ఏసీపీ రవీందర్, ఏవో శ్రీనివాస్, రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఇన్స్పెక్టర్లు, వివిధ విభాగాల ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు, ఆర్ఐలు, ఆర్ఎస్ఐలు, సీపీఓ సిబ్బంది, స్పెషల్ పార్టీ, ఏఆర్ సిబ్బంది, పోలీసు అమరవీరుల కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.












