ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, త్వరితగతిన పరిష్కరించే విధంగా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు అన్నారు. సోమవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో జిల్లా రెవెన్యూ అధికారి మోతిరామ్ తో కలిసి అర్జీదారుల నుండి దరఖాస్తుల స్వీకరించారు.
కన్నెపల్లి మండలం రెబ్బెన గ్రామ ఉపసర్పంచ్ అన్నారపు ప్రశాంత్, గ్రామంలో జరుగుతున్న అధికార దుర్వినియోగంపై సమగ్ర విచారణ జరిపి, తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. జైపూర్ మండలం మిట్టపల్లి గ్రామానికి చెందిన పప్పు అనూష, తాను ఎ.ఎన్.ఎం, జి.ఎన్.ఎం పూర్తి చేశానని, తన భర్త, కొడుకు సికిల్ సెల్ వ్యాధితో బాధపడుతున్నారని, కుటుంబ పోషణకు ఇబ్బందిగా ఉందని, మానవతా దృక్పథంతో తనకు ఉపాధి కల్పించాలని కోరుతూ అర్జీ సమర్పించారు. జన్నారం మండలం పొనకల్ గ్రామానికి చెందిన వల్లభనేని బాబురావు, గ్రామంలో గల భూమికి సంబంధించి హద్దురాయి తొలగించి, తిరిగి ఏర్పాటు చేయుటలో తనకు న్యాయం చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. మంచిర్యాల పట్టణానికి చెందిన దగమ లక్ష్మి, తనకు మంచిర్యాల మున్సిపల్ పరిధిలో ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయిందని, కానీ తనకు చెందిన భూమి క్యాతనపల్లి మున్సిపల్ పరిధిలో ఉందని, ఇట్టి ఇందిరమ్మ ఇంటిని క్యాతనపల్లి మున్సిపాలిటీకి బదిలీ చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజావాణి కార్యక్రమంలో 13 దరఖాస్తులు అందాయని, ప్రతి దరఖాస్తును క్షేత్రస్థాయిలో పరిశీలించి, త్వరగా పరిష్కరించే విధంగా అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకుంటామని తెలిపారు. జి.ఓ. నం. 59 క్రింద పెండింగ్‌లో ఉన్న 4,282 దరఖాస్తులు, జి.ఓ. నం. 76 క్రింద పెండింగ్‌లో ఉన్న 727 దరఖాస్తుల పరిష్కారానికి సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. జిల్లా అధికారుల బృందాలు, మండల స్థాయి అధికారుల సమన్వయంతో దరఖాస్తుల పరిశీలన, క్రమబద్ధీకరణ ప్రక్రియను వేగవంతం చేసి, త్వరగా పూర్తి చేయాలని సూచించారు.
జి.ఓ. నం. 59కు సంబంధించిన దరఖాస్తుల పరిశీలన సమయంలో తహసిల్దార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ (ఆర్.ఐ), గ్రామ పంచాయతీ అధికారి (జి.పి.ఓ) సంబంధిత రికార్డులతో క్షేత్రస్థాయికి వెళ్లాలని, 500 చదరపు గజాల లోపు విస్తీర్ణంలో ఉండి, నిర్మాణాలు ఉన్న స్థలాలకు సంబంధించిన నిబంధనలను అనుసరించి పరిశీలన చేపట్టాలని, సంబంధిత యజమానిని నిర్మాణంతో సహా ఫొటో తీసి, దరఖాస్తులోని నిర్దేశిత కాలమ్‌లను పూర్తిగా నమోదు చేసి ఆన్లైన్లో సమర్పించాలని తెలిపారు. ఈ ప్రక్రియలో ఏవైనా సందేహాలు ఉంటే రాజస్వ మండల అధికారి/సబ్ కలెక్టర్‌ను సంప్రదించాలని తెలిపారు. 22-ఎ జాబితాకు సంబంధించిన పెండింగ్ దరఖాస్తులను వేగంగా పరిశీలించి, నిబంధనల ప్రకారం పరిష్కరించాలని తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశాల మేరకు ప్రజల సమస్యలు, ఫిర్యాదులను 9492123642 వాట్సాప్ నంబర్ ద్వారా స్వీకరించడం జరుగుతుందని, ఫిర్యాదులను సంబంధిత శాఖల అధికారులకు పంపించి, పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లా రెవెన్యూ అధికారి నోడల్ అధికారిగా వ్యవహరిస్తున్నారని, వివిధ శాఖలకు అందిన ఫిర్యాదులను అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షించి, పరిష్కరించాలని సూచించారు. ఇన్చార్జి మంత్రి ఈ ఫిర్యాదుల పరిష్కారంపై సమీక్ష నిర్వహించే అవకాశం ఉన్నందున, అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజావాణి, జిల్లా ప్రజావాణి ద్వారా అందిన దరఖాస్తులను ప్రతి వారం పెండింగ్‌లో లేకుండా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ నెల 17వ తేదీ వరకు వాట్సాప్ ద్వారా 110 దరఖాస్తులు అందాయని, సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.











