మంచేరియల్, 16-07-2026
వెంకటాపూర్ గ్రామంలో కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా దేవాపూర్ పోలీసులు, మెడీలైఫ్, సన్‌రైజ్ హాస్పిటల్స్ సహకారంతో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ముఖ్య అతిథిగా హాజరై, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, రహదారి భద్రతా నిబంధనలు పాటించాలని సూచించారు.
రామగుండం పోలీస్ కమిషనరేట్, మంచిర్యాల జోన్, కాసిపేట మండలంలోని దేవాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల వెంకటాపూర్‌లో కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా, పోలీసుల సామాజిక బాధ్యతలో భాగంగా మెడీలైఫ్ హాస్పిటల్, సన్‌రైజ్ హాస్పిటల్, మంచిర్యాల వారి సహకారంతో గురువారం దేవాపూర్ పోలీసులు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్లకు గ్రామ మహిళలు సంప్రదాయబద్ధంగా ఘన స్వాగతం పలికారు. నుదుటిపై తిలకం దిద్ది, తలపాగా చుట్టి, పూలమాలలు వేసి సత్కరించారు. అనంతరం సంప్రదాయ వాయిద్యాలు, గిరిజన సాంస్కృతిక నృత్యాల నడుమ వారిని కార్యక్రమ వేదికకు తీసుకువచ్చారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ, మారుమూల ప్రాంతాల్లో కూడా విద్య, వైద్యం, రవాణా వంటి మౌలిక సదుపాయాలు గణనీయంగా అభివృద్ధి చెందడం ఆనందదాయకమన్నారు. గ్రామాల్లో మంచి పాఠశాలలు ఏర్పాటు కావడంతో పిల్లలు నాణ్యమైన విద్యను అభ్యసిస్తున్నారని, ప్రభుత్వ పాఠశాలలు కూడా మెరుగైన స్థాయిలో విద్యను అందించడం అభినందనీయమని పేర్కొన్నారు. గ్రామ ప్రజలు ఐక్యంగా ఉంటూ అభివృద్ధి దిశగా ముందుకు సాగాలని సూచించారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో శాంతిభద్రతలు మెరుగ్గా ఉన్నాయని, ప్రజలు ఎలాంటి భయాందోళనలు లేకుండా స్వేచ్ఛగా రాకపోకలు సాగించే పరిస్థితి నెలకొందన్నారు. మహిళా సంఘాలు స్వయం ఉపాధి, రుణాల ద్వారా ఆర్థికంగా బలోపేతం కావడం అభివృద్ధికి మంచి సంకేతమని తెలిపారు.
ప్రతి కుటుంబం తప్పనిసరిగా ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలని, యువతతో పాటు కుటుంబ సభ్యులెవరూ మత్తు పదార్థాలకు బానిస కాకుండా తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మత్తు పదార్థాలు వ్యక్తిని, కుటుంబాన్ని, సమాజాన్ని నాశనం చేస్తాయని, అందరూ వాటికి పూర్తిగా దూరంగా ఉండాలని కోరారు. ప్రతి ఒక్కరూ రహదారి భద్రతా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవారే వాహనాలు నడపాలని, మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వకూడదని, మద్యం సేవించి వాహనాలు నడపడం పూర్తిగా మానుకోవాలని సూచించారు. ఈ సూచనలను ప్రతి ఒక్కరూ పాటిస్తే కుటుంబాలు సురక్షితంగా ఉంటాయని పేర్కొన్నారు.
ప్రజల భద్రత, సంక్షేమం కోసం రామగుండం పోలీస్ కమిషరేట్ ఎల్లప్పుడూ సేవ చేసేందుకు సిద్ధంగా ఉంటుందని, ప్రజలు కూడా పోలీసు శాఖకు సహకరిస్తూ శాంతియుత, సురక్షిత, అభివృద్ధి చెందిన సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమం ద్వారా గ్రామ ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న వైద్యులను ప్రత్యేకంగా అభినందించారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణలో వైద్యుల సేవలు అమూల్యమైనవని పేర్కొన్నారు. అలాగే ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన గ్రామ సర్పంచ్, గ్రామ పెద్దలు, గ్రామస్థులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.












