Mancherial/Jaipur (ప్రజావార్త) జూలై 20
యాదాద్రి పుణ్యక్షేత్ర పరిరక్షణ భక్తుల బాధ్యత అని, పర్యావరణ పరిరక్షణే అసలైన భక్తి అని భక్తురాలు శ్రీమతి మంజుల పత్తిపాటి స్పష్టం చేశారు. దేవాలయ ప్రాంగణంలో ప్లాస్టిక్ చెత్తను నివారించి, పచ్చదనాన్ని పెంపొందించాలని ఆమె పిలుపునిచ్చారు.
యాదాద్రి యశోదీపం, యుగయుగాల వెలుగై భక్తుల హృదయాల్లో భాసిల్లే దివ్య నిలయమని, యాదాద్రి పరిరక్షణ కోసం చేసే చిన్న పని కూడా నరసింహుని పాదసేవలో అర్పించిన పుష్పమేనని భక్తురాలు శ్రీమతి మంజుల పత్తిపాటి పేర్కొన్నారు. 'గోవిందా... నరసింహా...' అంటూ గుండెల నిండా మొక్కుకుని, గర్భగుడి దర్శనానంతరం గుడి నేలను చెత్తతో నింపుతున్నారని, కొబ్బరికాయ కొట్టి కోరికలు తీర్చమని వేడుకుంటూ ప్లాస్టిక్ చెత్తతో పవిత్ర ప్రాంగణాన్ని కలుషితం చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
దేవుడికి పూలదండ వేయడం భక్తికి ఒక గుర్తయితే, దేవుడి ఇంటి ఆవరణాన్ని శుభ్రంగా ఉంచడం భక్తికి పరమార్థమని, పర్యావరణ పరిరక్షణే పరమపూజ అని పలుకుదామని ఆమె సూచించారు. పచ్చని ప్రకృతినే పరమప్రసాదమని భావించి, యాదాద్రిని దర్శించడమే కాదు, యాదాద్రిని రక్షించాలని పిలుపునిచ్చారు. మన చేతులతో చెత్త తొలగించి సేవాభక్తిని చాటుదామని, ప్లాస్టిక్కు వీడ్కోలు పలికి పచ్చదనానికి స్వాగతం పలుకుదామని, ప్రతి మొక్కను నాటి భవిత తరాలకు వరమై నిలుద్దామని ఆమె అన్నారు. దేవాలయ ప్రాంగణంలో ప్రతి ప్లాస్టిక్ సంచి, ప్లాస్టిక్ బాటిల్ మనకు శాపమని గుర్తుంచుకోవాలని సూచించారు.
శుభ్రమైన ప్రతి అడుగు శ్రీనరసింహునికి పుష్పార్చనేనని, పచ్చదనంతో నిండిన ప్రతి ప్రాంగణం పరమాత్మకు హారతియేనని మంజుల పత్తిపాటి తెలిపారు. యాదాద్రి మహిమను కీర్తిస్తూ ప్రకృతిని కాపాడుదామని, భక్తి, శక్తి, శుభ్రతలతో స్వామివారి ఆశీస్సులు పొందుదామని ఆమె అన్నారు. ఈ రచనను శ్రీమతి మంజుల పత్తిపాటి (యాదాద్రి భక్తురాలు, చరవాణి 9347042218) అందించారు.












