మంచేరియల్, 2026-07-20
వచ్చే ఏడాది నిర్వహించనున్న గోదావరి పుష్కరాలను విజయవంతంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే విస్తృత స్థాయిలో ఏర్పాట్లు ప్రారంభించిందని మంచిర్యాల డీసీపీ ఎ. భాస్కర్ తెలిపారు. ఈ నేపథ్యంలో, రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు డీసీపీ, ఏసీపీ, సీఐ, ఇతర అధికారులతో కలిసి గూడెం దేవాలయం ఘాట్‌ను సందర్శించి, ఏర్పాట్లను పరిశీలించారు.
వచ్చే ఏడాది నిర్వహించనున్న గోదావరి పుష్కరాలను విజయవంతంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే విస్తృత స్థాయిలో ఏర్పాట్లు ప్రారంభించిందని మంచిర్యాల డీసీపీ ఎ. భాస్కర్ తెలిపారు. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు, మంచిర్యాల జోన్, మంచిర్యాల సబ్ డివిజన్లోని లక్షెట్టిపేట, దండేపల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న గూడెం దేవాలయం ఘాట్‌ను డీసీపీ భాస్కర్, మంచిర్యాల ఏసీపీ ఆర్.ప్రకాష్, సీఐ రమణమూర్తి, సంబంధిత శాఖల అధికారులతో కలిసి ప్రత్యక్షంగా సందర్శించారు. గోదావరి తీర ప్రాంతాల్లో పుష్కరాల నిర్వహణకు చేపడుతున్న ఏర్పాట్లను పరిశీలించి, సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని అధికారులకు పలు సూచనలు చేశారు.
మంచిర్యాల జిల్లాలో టైర్-1 కింద మంచిర్యాల టౌన్ ఘాట్, గూడెం దేవాలయం ఘాట్, చెన్నూరు ఉత్తరవాహిని గోదావరి ఘాట్లను ప్రధాన ఘాట్లుగా గుర్తించినట్లు డీసీపీ చెప్పారు. అలాగే లక్ష్మిపేట ఘాట్‌ను టైర్-2 కింద, జిల్లాలోని మరో పది ఘాట్లను టైర్-3 కింద గుర్తించినట్లు పేర్కొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. రాష్ట్ర డీజీపీ ఘాట్లను స్వయంగా పరిశీలించి, భక్తుల భద్రతకు అవసరమైన వాచ్ టవర్ల ఏర్పాటు, వాటి పరిమాణం, నిర్మాణం, ఘాట్ల అభివృద్ధి తదితర అంశాలపై సంబంధిత శాఖలకు అవసరమైన సూచనలు చేసినట్లు తెలిపారు.
పుష్కరాల సందర్భంగా లక్షలాది మంది భక్తులు వచ్చే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకొని పోలీస్ శాఖ సమగ్ర భద్రతా ప్రణాళికను సిద్ధం చేస్తోందన్నారు. ఘాట్ల వద్ద కమాండ్ అండ్ కంట్రోల్ వ్యవస్థ, సీసీటీవీ కెమెరాలు, వీడియో అనలిటిక్స్ సాంకేతికతను వినియోగించి భక్తుల రద్దీని నిరంతరం పర్యవేక్షిస్తామని చెప్పారు. ఏ మార్గం ద్వారా ఎంతమంది భక్తులు వస్తున్నారు, ఘాట్ సామర్థ్యం ఎంత ఉంది, రద్దీ పెరిగితే ఎక్కడి నుంచి ట్రాఫిక్‌ను మళ్లించాలి వంటి అంశాలపై ముందస్తు ప్రణాళికలు రూపొందిస్తున్నామని వివరించారు. పరిశీలనలో గుర్తించిన అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించి, పుష్కరాల సందర్భంగా భక్తులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన వాతావరణం కల్పించేందుకు అన్ని శాఖల సమన్వయంతో చర్యలు చేపడుతున్నామని డీసీపీ తెలిపారు. ఈ పర్యటనలో మండల రెవెన్యూ అధికారి, తహసీల్దార్, ఇరిగేషన్ శాఖ ఏఈ, మంచిర్యాల ఏసీపీ ఆర్.ప్రకాష్, సీఐ రమణమూర్తి, ఎస్ఐ సురేష్, రాజవర్దన్, ఇతర సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.











