పర్యావరణ పరిరక్షణ, అటవీ సంరక్షణ లక్ష్యంగా పనిచేస్తున్న "ప్రకృతిమిత్ర" తెలంగాణ పర్యావరణ సామాజిక సంస్థ సభ్యులు శుక్రవారం రాత్రి కరీంనగర్ జిల్లా అటవీ శాఖాధికారి ఎస్. సత్యనారాయణను కలిసి, భవిష్యత్ కార్యక్రమాలపై చర్చించారు. ఈ సందర్భంగా వారు అటవీ శాఖాధికారికి పచ్చని మొక్కను బహుకరించారు.
"ప్రకృతిమిత్ర" సంస్థ రాష్ట్ర వ్యవస్థాపకులు గుండేటీ యోగేశ్వర్, కరీంనగర్ సభ్యులైన హర్జిత్ సింగ్, పుల్లె సత్యనారాయణ, గద్దె రవికుమార్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సంస్థ కార్యకలాపాలను వివరిస్తూ, భవిష్యత్తులో చేపట్టబోయే పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాల గురించి అటవీ శాఖాధికారికి తెలియజేశారు.
జిల్లా అటవీ శాఖాధికారి ఎస్. సత్యనారాయణ, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ షౌకత్ హుస్సేన్ "ప్రకృతిమిత్ర" సంస్థ కార్యక్రమాలను సానుకూలంగా స్వీకరించారు. సంస్థ చేపట్టే కార్యక్రమాలకు అటవీ శాఖ సంపూర్ణ సహకారాన్ని అందిస్తుందని హామీ ఇచ్చారు. సంస్థ చేస్తున్న కృషిని వారు అభినందించారు.
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమాలలో "ప్రకృతిమిత్ర" సభ్యులు చురుగ్గా పాల్గొని, వాటిని విజయవంతం చేయాలని అటవీ శాఖ అధికారులు కోరారు. ఈ సమావేశంలో సిరిసిల్ల, చందుర్తి మల్యాల ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లు, ఇతర అటవీ సిబ్బంది కూడా పాల్గొన్నారు.







