రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో నమోదయ్యే కేసుల విచారణలో నిందితులకు త్వరితగతిన శిక్షలు పడేలా పోలీసు అధికారులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ల మధ్య సమన్వయం మరింత బలోపేతం కావాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. కేసుల విచారణ, శిక్షల శాతం పెంపుపై ఆయన సమీక్ష నిర్వహించారు.
పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో నమోదయ్యే వివిధ రకాల కేసుల్లో దర్యాప్తు ప్రారంభం నుంచి కోర్టు విచారణ పూర్తయ్యే వరకు ఎదురయ్యే అంశాలు, సమస్యలపై రామగుండం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, కోర్టు లైజన్ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ, కేసుల విచారణలో నిందితులకు శిక్షలు పడేలా చేయడంలో పోలీసులతో పాటు పబ్లిక్ ప్రాసిక్యూటర్ల పాత్ర కూడా అత్యంత కీలకమని పేర్కొన్నారు. ఎఫ్ఐఆర్ నమోదు నుంచి చార్జ్‌షీట్ దాఖలు వరకు జరిగే ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
కోర్టులో విచారణ సమయంలో అవసరమైన సాక్ష్యాధారాలు, సాక్షులను సరైన విధంగా సమర్పించే అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. కేసుల దర్యాప్తు సమయంలో బాధితుల వాంగ్మూలాలను నమోదు చేసే వేళ పూర్తి జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న కేసుల పరిష్కారంలో ఎక్కడైనా సమన్వయ లోపాలు ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.
గుడ్ ట్రయల్ మానిటరింగ్ సిస్టమ్ ద్వారా నిందితులకు శిక్షలు పడేలా చర్యలు చేపడితేనే బాధితులకు నిజమైన న్యాయం జరుగుతుందని సీపీ తెలిపారు. న్యాయాధికారులతో నిరంతర సమన్వయం కొనసాగిస్తూ నేరస్థులకు తప్పనిసరిగా శిక్షలు పడే విధంగా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆయన సూచించారు. భవిష్యత్తులో మరింత సమర్థవంతమైన న్యాయ వ్యవస్థ కోసం అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.












