రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు మహిళల భద్రతపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.
రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు, మంచిర్యాల డీసీపీ భాస్కర్ పర్యవేక్షణలో, మంచిర్యాల జిల్లా షీ టీమ్ ఎస్ఐ. ఉషారాణి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా షీ టీమ్ సిబ్బంది విద్యార్థులకు మహిళల భద్రతకు సంబంధించిన వివిధ అంశాలపై వివరించారు.
ఈవ్-టీజింగ్, సైబర్ నేరాలు, మానవ అక్రమ రవాణా, ట్రాఫిక్ నియమాలు, టి-సేఫ్ యాప్ వంటి అంశాలపై సమగ్ర సమాచారం అందించారు. మహిళలు తమకు ఎదురయ్యే వేధింపులపై భయం వీడి వెంటనే ఫిర్యాదు చేయాలని సూచించారు.
అత్యవసర పరిస్థితుల్లో సంప్రదించాల్సిన హెల్ప్‌లైన్ నంబర్లు డయల్ 100, రామగుండం షీ టీమ్ వాట్సాప్ నంబర్ 6303923700, మంచిర్యాల జిల్లా షీ టీమ్ నంబర్ 8712659385 లను తెలియజేశారు. బాధితుల వివరాలు గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు.
తెలంగాణ ప్రభుత్వం మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ అనేక చర్యలు చేపడుతోందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో షీ టీమ్ సిబ్బంది, పాఠశాల హెడ్ మాస్టర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.












