మంచేరియల్, 08-07-2026
గోదావరిఖని చంద్రబాబు కాలనీలో ఎల్లపూల రమణమ్మ (65) అనుమానాస్పద మృతిపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సంఘటన స్థలాన్ని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా పరిశీలించి, కేసు పురోగతిపై అధికారులతో సమీక్షించారు. మృతురాలి ఇంట్లో బంగారు ఆభరణాలు కనిపించకపోవడంతో ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి జిల్లా గోదావరిఖని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చంద్రబాబు కాలనీలో నివాసముంటున్న ఎల్లపూల రమణమ్మ (65) తన నివాసంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటనపై పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సంఘటన స్థలాన్ని పరిశీలించారు.
స్థానికుల సమాచారంతో మృతురాలి కుమారుడు ఇంటికి వచ్చి చూడగా, రమణమ్మ మంచంపై మృతి చెంది ఉండగా, ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసు, చెవికమ్మలు, సుమారు ఐదు తులాల బంగారు గాజులు కనిపించకపోవడంతో అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు గోదావరిఖని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
దర్యాప్తులో భాగంగా పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సంఘటన స్థలం, పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించి, మృతురాలి కుమారుడితో మాట్లాడి ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎవరిపైనైనా అనుమానం ఉన్నా, లేదా ఘటనకు సంబంధించిన ఏదైనా కీలక సమాచారం తెలిసినా వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు. కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి, నిందితులను త్వరితగతిన గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
అనంతరం గోదావరిఖని ఏసీపీ ఎం.రమేష్, వన్‌టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి నుంచి కేసు దర్యాప్తు పురోగతిపై వివరాలు తెలుసుకున్నారు. పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల దృశ్యాలను క్షుణ్ణంగా పరిశీలించాలని, అనుమానాస్పద వ్యక్తులను గుర్తించి విచారించాలని, కేసుకు సంబంధించిన అన్ని ఆధారాలను సేకరించి దర్యాప్తును వేగవంతంగా పూర్తి చేయాలని, ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి నిందితులను త్వరితగతిన పట్టుకోవాలని అధికారులను ఆదేశించారు.












