మంచేరియల్, 04-07-2026
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని భీమారం పోలీస్ స్టేషన్లో పోలీసు విధులకు ఆటంకం కలిగించిన వ్యక్తికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. ఈ నెల 2వ తేదీన జరిగిన ఘటనలో నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా ఈ ఆదేశాలు వెలువడ్డాయి.
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని భీమారం పోలీస్ స్టేషన్లో పోలీసు విధులకు ఆటంకం కలిగించిన వ్యక్తికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించినట్లు భీమారం ఎస్ఐ ఎ. రాజేందర్ తెలిపారు. ఈ నెల 2వ తేదీ మధ్యాహ్నం 2.30 గంటలకు డయల్-100కు చొప్పరి పవన్ ఫోన్ చేసి, తాను ఇంట్లో లేని సమయంలో తన అన్న చొప్పరి శేఖర్ మద్యం మత్తులో ఇంటికి వచ్చి తన భార్యతో గొడవపడుతున్నాడని ఫిర్యాదు చేశాడు.
వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న బ్లూ కోల్ట్స్ పోలీసు సిబ్బందితో బోయవాడ, భీమారం నివాసి చొప్పరి శేఖర్ దుర్భాషలాడడమే కాకుండా, వారిపై దాడి చేసేందుకు ప్రయత్నించి, విధులకు ఆటంకం కలిగించాడు. పోలీసు సిబ్బంది ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేసి చెన్నూరు కోర్టులో హాజరుపరచగా, కోర్టు అతనికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.
ఈ సందర్భంగా భీమారం ఎస్ఐ ఎ. రాజేందర్ మాట్లాడుతూ, ప్రజలు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోరాదని సూచించారు. పోలీసు విధులకు ఆటంకం కలిగించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.










