మంచిర్యాల జిల్లాలో నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. భీమారం, చెన్నూర్ మండలాల్లో జరిగిన ఈ దాడుల్లో సుమారు 386 కిలోల నిషేధిత BT3 పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ముగ్గురిని అరెస్ట్ చేయగా, మరో ఇద్దరి కోసం గాలింపు జరుగుతోంది.
మంచిర్యాల జిల్లాలోని భీమారం, చెన్నూర్ మండలాల్లో నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ దాడుల్లో ప్రభుత్వ నిషేధిత BT3 పత్తి విత్తనాలు సుమారు 386 కిలోలు స్వాధీనం చేసుకున్నట్లు మంచిర్యాల డీసీపీ భాస్కర్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఏసీపీ కార్యాలయంలో వివరాలు వెల్లడించారు.
ఐదుగురు సభ్యులున్న ఈ ముఠా ఆంధ్ర ప్రాంతం నుండి నకిలీ పత్తి విత్తనాలను తెప్పించి, స్థానికంగా అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు డీసీపీ తెలిపారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకోగా, పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. నకిలీ విత్తనాల వాడకం వల్ల భూసారం తగ్గి, పంట నష్టంతో పాటు పర్యావరణానికి హాని కలుగుతుందని ఆయన హెచ్చరించారు.
రైతులు నకిలీ విత్తనాల బారిన పడకుండా జాగ్రత్త వహించాలని, గతంలో కూడా అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం, పోలీసులు నకిలీ విత్తనాలపై కఠినంగా వ్యవహరిస్తామని, పీడీ యాక్ట్ కేసులు కూడా నమోదు చేస్తామని, ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని, శాఖాపరమైన చర్యలు తప్పవని డీసీపీ హెచ్చరించారు.
ఈ కేసుల దర్యాప్తులో ప్రతిభ కనబర్చిన పోలీసు అధికారులను డీసీపీ అభినందించారు. వారికి త్వరలో రివార్డులు అందజేస్తామని తెలిపారు.












