మందమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి సేవిస్తున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైద్య పరీక్షల అనంతరం న్యాయస్థానం ఆదేశాల మేరకు వారిని 15 రోజుల పాటు పునరావాస కేంద్రానికి తరలించారు.
పోలీసులు పట్టణంలో తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా గంజాయి సేవించినట్లు అంగీకరించారు. దీంతో, చట్టపరమైన చర్యలు చేపట్టి వైద్య పరీక్షల నిమిత్తం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
వైద్య పరీక్షల్లో గంజాయి సేవించినట్లు నిర్ధారణ కావడంతో, నిందితులను స్థానిక న్యాయస్థానంలో హాజరుపరిచారు. కేసు వివరాలను పరిశీలించిన న్యాయమూర్తి, వారిని 15 రోజుల పాటు డీ-అడిక్షన్ (పునరావాస) కేంద్రానికి తరలించాలని ఆదేశాలు జారీ చేశారు.
గంజాయి సేవించిన వారిని పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన మందమర్రి ఎస్ఐ నరేష్, సిబ్బంది మహేష్, చైతన్యలను పోలీస్ ఉన్నతాధికారులు అభినందించారు. సమాజంలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ నరేష్ హెచ్చరించారు.











