మంచిర్యాల జోన్ పరిధిలో గంజాయి, ఇతర మత్తు పదార్థాల వినియోగాన్ని అరికట్టడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన డి-అడిక్షన్ సెంటర్ను మంచిర్యాల డిసిపి ఏ. భాస్కర్, మంచిర్యాల ఏసీపీ ఆర్.ప్రకాష్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మత్తు పదార్థాల వినియోగంపై ప్రజల భాగస్వామ్యాన్ని కోరారు.
మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన డి-అడిక్షన్ సెంటర్ను సందర్శించిన డిసిపి ఏ. భాస్కర్, చికిత్స పొందుతున్న యువకులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితి, చికిత్స విధానం గురించి వివరాలు తెలుసుకున్నారు. మత్తు పదార్థాలకు బానిసలైన వారిని గుర్తించి నార్కోటిక్ పరీక్షలు నిర్వహిస్తున్నామని, పాజిటివ్ వచ్చిన వారిని కోర్టు ఆదేశాల మేరకు డి-అడిక్షన్ సెంటర్కు పంపిస్తున్నామని ఆయన తెలిపారు.
డి-అడిక్షన్ సెంటర్లో వైద్య చికిత్సతో పాటు మానసిక మార్పు కోసం ప్రత్యేక కౌన్సిలింగ్ అందిస్తున్నామని డిసిపి పేర్కొన్నారు. ఇప్పటివరకు మంచిర్యాల జోన్లో 19 మందికి నార్కోటిక్ పరీక్షలు నిర్వహించి, పాజిటివ్ వచ్చిన వారిని చికిత్సకు తరలించినట్లు ఆయన వెల్లడించారు. గంజాయి సరఫరా చేసే వారిపై నిఘా కొనసాగుతోందని, గంజాయి సేవించే వారిని గుర్తించి, వారిని ఆ అలవాటు నుంచి దూరం చేస్తే సరఫరా తగ్గే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
తల్లిదండ్రులు, పెద్దలు తమ పరిసరాల్లో గంజాయి విక్రయిస్తున్నా లేదా సేవిస్తున్నా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని డిసిపి కోరారు. పోలీసులు స్పందించి, నిందితులపై కేసులు నమోదు చేసి, నార్కోటిక్ పరీక్షలు నిర్వహిస్తారని, పాజిటివ్ వచ్చిన వారికి చికిత్స అందిస్తామని తెలిపారు. చికిత్స తర్వాత కూడా మళ్లీ మత్తు పదార్థాలకు బానిసై పట్టుబడితే కఠిన చర్యలు తీసుకుని జైలుకు పంపిస్తామని హెచ్చరించారు.
నిపుణులైన వైద్యుల సహాయంతో మత్తు బారిన పడిన వ్యక్తులు తిరిగి సాధారణ జీవితంలోకి వచ్చే అవకాశం ఉందని, డ్రగ్స్ రహిత మంచిర్యాల నిర్మాణంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని డిసిపి భాస్కర్ పిలుపునిచ్చారు.








