మంచేరియల్, 2026-07-20
గోదావరిఖని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిక్వాడా ప్రాంతంలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. పాత భవనాలు, జనసంచారం తక్కువగా ఉండే ప్రాంతాల్లో చట్టవ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నాయనే సమాచారం మేరకు నార్కోటిక్ డాగ్ సహాయంతో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో పలు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గోదావరిఖని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిక్వాడా ప్రాంతంలో గోదావరిఖని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ ప్రాంతంలో పాత భవనాలు, జనసంచారం తక్కువగా ఉండే ప్రదేశాలు ఎక్కువగా ఉండటంతో కొందరు చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు అందిన సమాచారం మేరకు నార్కోటిక్ డాగ్ సహాయంతో ఆయా ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. అదేవిధంగా ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో 32 మోటార్‌సైకిళ్లు, ఒక టాటా ఏస్ ట్రాలీని స్వాధీనం చేసుకోగా, నంబర్ ప్లేట్లు లేని 12 ద్విచక్ర వాహనాలను తదుపరి విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ... గంజాయి, ఇతర మాదకద్రవ్యాల వినియోగం, నిల్వ, సరఫరా, అక్రమ రవాణా, విక్రయం, సేవించడం వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని హెచ్చరించారు. గంజాయి, ఇతర చట్టవ్యతిరేక కార్యకలాపాల్లో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రమేయం ఉన్న వారందరిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. స్క్రాప్ దొంగతనాలు, పారిశ్రామిక సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తుల చోరీలు, దొంగిలించిన స్క్రాప్ కొనుగోలు, నిల్వ, రవాణా, విక్రయం వంటి నేరాలకు పాల్పడే వారిపై ప్రత్యేక నిఘా ఉంచామని తెలిపారు. అలాంటి నేరాల్లో పాల్గొనే వారిని గుర్తించి కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
శాంతిభద్రతలకు భంగం కలిగించే, ప్రజలను భయాందోళనలకు గురిచేసే చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తుల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. మహిళల భద్రత, సైబర్ మోసాలు, సామాజిక మాధ్యమాల వినియోగంలో భద్రత, ట్రాఫిక్ నిబంధనలు, డయల్-100 సేవలు, గంజాయి, మాదకద్రవ్యాల నిర్మూలనపై ప్రజలకు అవగాహన కల్పించారు. అలాగే నేరాల నివారణ, నేరస్థుల గుర్తింపులో సీసీ కెమెరాల ప్రాధాన్యతను వివరించి ప్రతి కాలనీ, వ్యాపార సంస్థ, నివాస ప్రాంతంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ప్రజల భాగస్వామ్యంతో శాంతిభద్రతలను పరిరక్షించడం, పోలీసులకు–ప్రజలకు మధ్య సత్సంబంధాలను మరింత బలోపేతం చేయడమే ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశ్యమని ఏసీపీ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ ఎం.రమేష్, ఇన్స్పెక్టర్లు ఇంద్రసేనారెడ్డి, అఫ్జాలోద్దీన్, ఎస్సైలు ప్రసాద్, మనోహర్, అనూష, లక్ష్మణ్‌తో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.












