రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో పెండింగ్ కేసుల పరిష్కారం, ఎన్ఫోర్స్మెంట్ కార్యకలాపాలపై పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. కేసుల దర్యాప్తులో పారదర్శకత, నాణ్యత పాటించాలని, చట్టవిరుద్ధ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అధ్యక్షతన జరిగిన నేర సమీక్షా సమావేశంలో పెండింగ్ కేసులు, నిందితుల అరెస్టులు, దర్యాప్తు పురోగతి, వారెంట్ల అమలు వంటి అంశాలపై చర్చించారు. ముఖ్యంగా 2025కు ముందు నమోదైన దీర్ఘకాలిక పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు.
మహిళలపై నేరాలు, ఆర్థిక నేరాల దర్యాప్తులో నిర్లక్ష్యం వహించరాదని సీపీ స్పష్టం చేశారు. ఆస్తుల జప్తు, బాధితుల గుర్తింపులో జాప్యం జరగకుండా చూడాలని, ఎన్డీపీఎస్ కేసుల్లో స్వాధీనం చేసుకున్న డ్రగ్స్‌ను న్యాయస్థానం అనుమతితో నిర్వీర్యం చేయాలని సూచించారు. సైబర్ క్రైమ్, ఎన్డీపీఎస్ కేసుల్లో ఇతర రాష్ట్రాల నేరస్థులను పట్టుకునేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.
అక్రమ ఇసుక రవాణా, గుడుంబా తయారీ, పేకాట, గుట్కా విక్రయాలు, రేషన్ బియ్యం అక్రమ రవాణా వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీ ఆదేశించారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ అక్రమాలను అరికట్టేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
పోలీస్ స్టేషన్లకు వచ్చే ప్రజలతో మర్యాదగా వ్యవహరించాలని, వారి ఫిర్యాదులపై తక్షణ స్పందన ఇవ్వాలని సీపీ సూచించారు. ఫిర్యాదుల ఆధారంగా వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శించే అధికారులను సహించేది లేదని హెచ్చరించారు. విధి నిర్వహణలో హెల్మెట్, సీట్‌బెల్ట్ తప్పనిసరిగా వినియోగించాలని సూచించారు.











