బెల్లంపల్లి 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంలో భాగంగా, సరైన ధ్రువపత్రాలు లేని 50 ద్విచక్ర వాహనాలు, 6 ఆటోలను పోలీసులు సీజ్ చేశారు. ప్రజల భద్రతే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టారు.
బెల్లంపల్లి 1 టౌన్ ఇన్స్పెక్టర్ కె.శ్రీనివాస్‌రావు ఆధ్వర్యంలో, రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్ ఆదేశాల మేరకు, బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్ పర్యవేక్షణలో ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం జరిగింది. ఈ సందర్భంగా బస్తీలోని అనుమానిత ప్రాంతాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
కొత్తగా వచ్చిన వ్యక్తుల వివరాలను సేకరించడంతో పాటు, వాహన తనిఖీలు చేపట్టారు. సరైన ధ్రువపత్రాలు లేని 50 ద్విచక్ర వాహనాలు, 06 ఆటోలను సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతోనే నేరాలను అరికట్టవచ్చని ఇన్స్పెక్టర్ శ్రీనివాస్‌రావు ఈ సందర్భంగా పేర్కొన్నారు.
అపరిచితులు, నేర చరిత్ర కలిగిన వ్యక్తులపై సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కాలనీల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు పోలీసుల సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు.
వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో 20 మంది పోలీస్ అధికారులు, సిబ్బందితో పాటు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.








