మంచేరియల్, 13-07-2026
పెద్దపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన అటెన్షన్ డైవర్షన్ దొంగతనం కేసులో కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. బాధితురాలిని జ్యోతిష్యం, పూజల పేరుతో మోసం చేసి బంగారు ఆభరణాలను అపహరించినట్లు తెలిపారు.
పెద్దపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన అటెన్షన్ డైవర్షన్ దొంగతనం కేసును పోలీసులు విజయవంతంగా ఛేదించారు. ఈ కేసులో కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు.
అరెస్టు చేసిన నిందితులను లతేశ్ మగ్గెకవల్ రంగన్న అలియాస్ లతేశ్ ఎం.ఆర్. (24), తండ్రి: రంగన్న, నివాసం: మగ్గెకవల్ శ్రీరాంపుర గ్రామం, అరకలగూడ్ మండలం, హసన్ జిల్లా, కర్ణాటక. రెండవ నిందితుడు సుదీప్ మగ్గెకవల్ శేఖర్ (24), తండ్రి: శేఖర్, నివాసం: మగ్గెకవల్ శ్రీరాంపుర గ్రామం, అరకలగూడ్ మండలం, హసన్ జిల్లా, కర్ణాటక.
కేసు వివరాల్లోకి వెళితే, నిందితులు బాధితురాలిని జ్యోతిష్యం, ప్రత్యేక పూజల పేరుతో నమ్మించి, మాంగల్య దోషం తొలగిస్తామని విశ్వసింపజేశారు. అనంతరం పూజల పేరుతో ఆమె దృష్టి మరల్చి ఆమె వద్ద ఉన్న రెండు తులాల బంగారు పుస్తెల తాడు, రెండు గ్రాముల బంగారు కమ్మలను అపహరించారు.
సాంకేతిక ఆధారాలు, సీసీటీవీ దృశ్యాలు, విశ్వసనీయ సమాచారంతో ప్రత్యేక బృందాలు నిందితులను గుర్తించి అరెస్టు చేశాయి. వారి వద్ద నుంచి దొంగిలించిన బంగారు ఆభరణాలు, నేరానికి ఉపయోగించిన సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టులో హాజరుపరచగా రిమాండ్కు తరలించారు. కేసు సంబంధించిన ఇతర కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది.
ఈ సందర్భంగా ప్రజలు అపరిచితుల మాటలను నమ్మకుండా అప్రమత్తంగా ఉండాలని, జ్యోతిష్యం, పూజల పేరుతో దృష్టి మరల్చే ప్రయత్నాలు జరిగితే వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు లేదా డయల్–100కు సమాచారం అందించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.










