మంచిర్యాల జిల్లాలోని కన్నెపల్లి మండల కేంద్రంలో ప్రజల సౌకర్యార్థం నూతనంగా నిర్మించిన పోలీస్ స్టేషన్ భవనాన్ని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డి.జి.పి.) శివధర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా డ్రైవర్లకు కంటి అద్దాలను పంపిణీ చేశారు.
డి.జి.పి. శివధర్ రెడ్డి, మల్టీ జోన్-1 ఐ.జి. చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, రామగుండం కమిషనర్ ఆఫ్ పోలీస్ అంబర్ కిషోర్ ఝా, బెల్లంపల్లి శాసనసభ్యులు గడ్డం వినోద్ తో పాటు పలువురు అధికారులు కలిసి కన్నెపల్లి పోలీస్ స్టేషన్ నూతన భవనాన్ని ఆదివారం ప్రారంభించారు. ప్రజల రక్షణ, భద్రత, సమస్యల పరిష్కారానికి పోలీస్ శాఖ అహర్నిశలు కృషి చేస్తుందని, నూతన భవనం ద్వారా సేవలు మరింత మెరుగుపడతాయని డి.జి.పి. తెలిపారు. ప్రజారక్షణలో సాంకేతికత వినియోగం పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు.
అనంతరం బెల్లంపల్లిలో ఆటో, లారీ డ్రైవర్లకు కంటి పరీక్షలు నిర్వహించి, కంటి అద్దాలను అందజేశారు. రాష్ట్రంలో చట్టం అందరికీ ఒకటేనని, రహదారి భద్రతా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని డి.జి.పి. సూచించారు. 'అరైవ్ - అలైవ్' కార్యక్రమం ద్వారా సురక్షిత ప్రయాణానికి ప్రాధాన్యత ఇవ్వాలని వాహనదారులను కోరారు. వాహనాల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో, డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలని, అతివేగం, నిర్లక్ష్యం ప్రమాదాలకు దారితీస్తాయని హెచ్చరించారు.
ద్విచక్ర వాహనదారులు, కార్లలో ప్రయాణించేవారు హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని, ఆటో డ్రైవర్లు నిబంధనలను పాటించాలని డి.జి.పి. సూచించారు. వాహనం నడుపుతున్నప్పుడు మొబైల్ ఫోన్ వాడటం, మద్యం సేవించి డ్రైవ్ చేయడం వంటివి చేయరాదని ఆయన స్పష్టం చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజల భాగస్వామ్యం కూడా కీలకమని తెలిపారు.
రోడ్డు ప్రమాదాలలో మృతి చెందిన వారి కుటుంబాలకు భీమా చెక్కులను పంపిణీ చేశారు. అంతకుముందు రామగుండంలోని జ్యోతి గెస్ట్ హౌస్ కు చేరుకున్న డి.జి.పి.ని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు.




