రాజమండ్రిలోని గోదావరి రోడ్డు, కాలేజీ రోడ్డు ప్రాంతాలలో పేరుకుపోతున్న చెత్త వల్ల స్థానికులు, నడకకు వచ్చేవారు, గోదావరికి పుణ్యస్నానాలకు వచ్చే భక్తులు, మాతా శిశు ఆసుపత్రికి వచ్చేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వ్యర్థాల వల్ల దుర్వాసన వెదజల్లుతోందని, దీనిపై మున్సిపల్ అధికారులు స్పందించాలని స్థానికులు కోరుతున్నారు.
ప్రతిరోజూ అనేకమంది వాకర్స్, భక్తులు, పిల్లలు తిరిగే గోదావరి రోడ్డు, కాలేజీ రోడ్డు ప్రాంతాలలో చెత్తను రోడ్డు పక్కనే పడవేయడం స్థానికులకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తోంది. ముఖ్యంగా వేసవి సెలవుల నేపథ్యంలో పిల్లలు ఎక్కువగా తిరిగే ఈ ప్రాంతాలలో పరిశుభ్రత లోపించడం ఆందోళన కలిగిస్తోంది.
కాలేజీ రోడ్డులోని చికెన్ షాపుల యజమానులు పనికిరాని వ్యర్థాలను సాయంత్రం వేళల్లో రోడ్డు పక్కనే పడవేయడంతో దుర్వాసన తీవ్రతరమవుతోందని, ఇది మాతా శిశు ఆసుపత్రికి వచ్చేవారికి కూడా ఇబ్బందికరంగా మారిందని స్థానికులు తెలిపారు. వైకుంఠధామం సందర్శనకు వచ్చేవారు కూడా ఈ దుర్వాసనతో అసహనానికి గురవుతున్నారు.
ఈ సమస్యపై మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేదని, వ్యర్థాలను సకాలంలో తరలించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని స్థానికులు విమర్శించారు. తక్షణమే ఈ సమస్యపై స్పందించి, చెత్తను డంపింగ్ యార్డుకు తరలించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
పరిశుభ్రతను కాపాడాల్సిన బాధ్యత మున్సిపల్ అధికారులదని, ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడటం సరికాదని స్థానికులు అభిప్రాయపడ్డారు. అధికారులు స్పందించి, ఈ చెత్త సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని వారు కోరుతున్నారు.








