మంచేరియల్, 16-07-2026
మంచిర్యాల శ్రీ విశ్వనాథ ఆలయ పాలకమండలి చైర్మన్ పదవిని బీసీ వర్గానికి కేటాయించాలని, అలాగే పాలకమండలిలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళలకు సముచిత ప్రాతినిధ్యం కల్పించాలని కోరుతూ బీసీ సమాజ్ రాష్ట్ర కార్యదర్శి నరెడ్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ పదవిని కొన్నేళ్లుగా ఒకే సామాజిక వర్గానికి కేటాయించడం సామాజిక న్యాయ స్ఫూర్తికి విరుద్ధమని వారు ఆరోపించారు.
మంచిర్యాల పట్టణంలోని శ్రీ విశ్వనాథ ఆలయ పాలకమండలి చైర్మన్ పదవిని బీసీ సామాజిక వర్గానికి కేటాయించాలని, పాలకమండలిలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళలు మరియు ఇతర సామాజిక వర్గాలకు సముచిత ప్రాతినిధ్యం కల్పించాలని కోరుతూ బీసీ సమాజ్ రాష్ట్ర కార్యదర్శి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు నరెడ్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో గౌరవ జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా నరెడ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ, శ్రీ విశ్వనాథ ఆలయ పాలకమండలి చైర్మన్ పదవిని అనేక సంవత్సరాలుగా ఒకే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులకే కేటాయించడం సామాజిక న్యాయ స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన బీసీలతో పాటు ఎస్సీ, ఎస్టీ మరియు ఇతర వెనుకబడిన వర్గాలకు నాయకత్వ అవకాశాలు కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 14, 15, 16, 38, 46 స్ఫూర్తికి అనుగుణంగా ఆలయ పాలకమండలి నియామకాల్లో సమాన అవకాశాలు, పారదర్శకత మరియు సామాజిక న్యాయం పాటించాలని విజ్ఞప్తి చేశారు.
అలాగే, ఇప్పటి వరకు జరిగిన నియామకాలపై సమీక్ష నిర్వహించి, రాబోయే పాలకమండలి నియామకంలో చైర్మన్ పదవిని బీసీ సామాజిక వర్గానికి కేటాయించేలా ఎండోమెంట్స్ శాఖకు తగిన సూచనలు చేయాలని జిల్లా కలెక్టర్‌ను కోరారు.
ఈ వినతిపై సానుకూలంగా స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని బీసీ సమాజ్ తరఫున విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో బీసీ సమాజ్ జిల్లా ఉపాధ్యక్షులు బొలిశెట్టి లక్ష్మణ్, బీసీ సమాజ్ జిల్లా నాయకులు పెద్దపెల్లి సూరయ్య, చల్ల విజయ్ కుమార్, కొండ రాజు, కుడుక మోహన్ తదితరులు పాల్గొన్నారు.











