Mancherial/Jaipur (ప్రజావార్త) జూలై 23
మంచిర్యాల జిల్లాలో ఎరువుల అక్రమ అమ్మకాలపై అధికారులు దృష్టి సారించారు. గరిష్ట చిల్లర ధర కంటే ఎక్కువ ధరకు అమ్మకాలు జరిపితే కఠిన చర్యలు తప్పవని జిల్లా వ్యవసాయ అధికారిణి ఇ. సురేఖ హెచ్చరించారు. బుధవారం జైపూర్ మండలంలో పలు ఎరువుల విక్రయ కేంద్రాలపై ఆమె ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
మంచిర్యాల జిల్లాలోని రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ గరిష్ట చిల్లర ధర కంటే ఎక్కువ ధరకు ఎరువులను కొనుగోలు చేయవద్దని జిల్లా వ్యవసాయ అధికారిణి ఇ. సురేఖ సూచించారు. ఈ మేరకు ఆమె రైతులకు హెచ్చరికలు జారీ చేశారు.
బుధవారం జైపూర్ మండలంలోని పలు ఎరువుల విక్రయ కేంద్రాలపై సహాయ వ్యవసాయ సంచాలకులు బి. ప్రసాద్, మండల వ్యవసాయ అధికారిణి సయ్యద్ ఖుదసియా గుల్రెజితో కలిసి ఆమె ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా దుకాణాల్లోని నిల్వలు, రికార్డులు, ధరల బోర్డులను పరిశీలించి, రైతులతో నేరుగా మాట్లాడారు.
ఈ సందర్భంగా సురేఖ మాట్లాడుతూ, రైతులు ఎరువులు కొనేటప్పుడు తప్పనిసరిగా కంప్యూటర్ బిల్లు తీసుకోవాలని, ఎంఆర్పి కంటే ఒక్క రూపాయి కూడా ఎక్కువ ఇవ్వద్దని స్పష్టం చేశారు. డీలర్లు ఎవరైనా అదనపు ధర వసూలు చేసినా, లేదా ఎరువులతో పాటు ఇతర వస్తువులను బలవంతంగా అంటగట్టినా వెంటనే అధికారులకు ఫిర్యాదు చేయాలన్నారు.
నిబంధనలు ఉల్లంఘించి అక్రమాలకు పాల్పడితే ‘ఫెర్టిలైజర్ కంట్రోల్ ఆర్డర్, 1985’ ప్రకారం డీలర్ల లైసెన్స్ రద్దు చేయడంతో పాటు కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.












