జిల్లాలో పత్తి, వరి తదితర పంటల కొనుగోలు ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు లారీ యజమానులు, జిల్లా లారీ అసోసియేషన్ ప్రతినిధులు పూర్తి స్థాయిలో సహకరించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఒక ప్రకటనలో తెలిపారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని పంటల కొనుగోలు, రవాణా ప్రక్రియలు నిరంతరాయంగా కొనసాగేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన సూచించారు.
పంటల కొనుగోలు కేంద్రాల నుంచి పంటలను తరలించే రవాణా ప్రక్రియలో, కొనుగోలు కేంద్రాల వద్ద లారీలను అందుబాటులో ఉంచడం, అవసరమైన సమయంలో రవాణా సదుపాయాలు కల్పించడం వంటి అంశాలలో లారీ యజమానులు సహకరించాలని, పంటల కొనుగోలు ప్రక్రియకు ఎలాంటి ఆటంకాలు కలిగించరాదని ఆయన సూచించారు. కొనుగోలు ప్రక్రియకు ఆటంకాలు కలిగించినట్లయితే సంబంధిత వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడంతో పాటు వారి లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్ రద్దు చేయడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు. పంటల కొనుగోలుకు అవసరమైన రవాణా సదుపాయాలను సమకూర్చే క్రమంలో, అవసరాన్ని బట్టి ఇతర ప్రాంతాల నుంచి లారీలను జిల్లాలోకి అనుమతించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో జిల్లా లారీ అసోసియేషన్ ప్రతినిధులు, లారీ యజమానులు జిల్లా యంత్రాంగానికి సహకరిస్తూ, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆయన కోరారు.












