మంచేరియల్, 2026-07-30
మంచిర్యాల పట్టణంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూల్ కాంపౌండ్ గోడను బైక్ ఢీకొనడంతో ఒక వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మంచిర్యాల పట్టణంలోని హమాలివాడలో స్కూల్ కాంపౌండ్ గోడను ఢీకొని ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. నిమ్మల కృష్ణవేణి ఫిర్యాదు మేరకు, నిమ్మల విజయ్ కుమార్ (39) అనే వ్యక్తి ఈరోజు ఉదయం 11 గంటలకు తన ఇంట్లో నుంచి మోటార్ సైకిల్ పై కొత్తగా నిర్మిస్తున్న ఇంటికి వెళ్లి, పని ముగించుకుని ఇంటికి తిరిగి వస్తున్నాడు.
మధ్యాహ్నం సుమారు 1.30 గంటలకు హమాలివాడ మూలమలుపు వద్ద బైక్ అదుపుతప్పి, ఎదురుగా ఉన్న యూపీఎస్ ఉర్దూ మీడియం స్కూల్ కాంపౌండ్ గోడను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వ్యక్తి బైక్ తో పాటు పక్కనే ఉన్న కాలువలో పడిపోయాడు. కాలనీవాసులు గమనించి, అతన్ని ఆసుపత్రికి తరలించగా, తలకు బలమైన గాయం కారణంగా మృతి చెందినట్లు డ్యూటీలో ఉన్న డాక్టర్ నిర్ధారించారు.
ఈ విషయంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ ఎస్ఐ రమేష్ తెలిపారు.












