ఇటీవల సిసిసి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు రవీంద్ర ఖని ప్రెస్ క్లబ్ సంతాపం ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం మండలంలోని గుడిపల్లి, వెంకటాపూర్, పొన్నారం గ్రామాల్లోని మృతుల ఇళ్లకు వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ప్రెస్ క్లబ్ అధ్యక్షులు దుస్స శివప్రసాద్ నేతృత్వంలో వర్కింగ్ ప్రెసిడెంట్ రామిల్ల శ్రీనివాస్, జనరల్ సెక్రెటరీ పోలుదాసరి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు రామిడి సృజన్, జాయింట్ సెక్రెటరీ కందుల ప్రవీణ్ తదితరులు ఆయా గ్రామాలను సందర్శించారు. మృతులైన చింతకుంట లక్ష్మి, సోనియా, తొగరి సుమలత, రాంటెంకి దివ్యవాణి, అగ్గు సౌందర్య కుటుంబ సభ్యులను కలిసి పలకరించారు.
దివ్యవాణి పిల్లలు మా మమ్మీ దేవుడి దగ్గరికి పోయిందంట అని చెప్పడంతో అక్కడున్న వారంతా కంటతడి పెట్టారు. కుటుంబాలను ఆదుకోవడం కోసం 20 కిలోమీటర్ల దూరం వెళ్లి చిన్న, చిన్న పనులు చేస్తున్న ఈ యువతులకు ఇలా ప్రమాదం జరగడం, మృత్యువాత పడడం తీవ్ర బాధాకరమని అధ్యక్షులు దుస్స శివప్రసాద్ అన్నారు.
మృతుల కుటుంబ సభ్యులందరూ ధైర్యంగా ఉండాలని ప్రెస్ క్లబ్ సభ్యులు వారికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా మూడు గ్రామాల్లోని సర్పంచులు సెగ్యం వెంకటేష్, మధు, ఉప సర్పంచ్ సిద్ధం నరేందర్ రవీంద్రఖని ప్రెస్ క్లబ్ కు సహకరించారు.












