మంచేరియల్, 17-07-2026
మంచిర్యాల పట్టణంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారం, రోడ్డు ప్రమాదాల తగ్గింపునకు చేపట్టాల్సిన చర్యలపై డీసీపీ ఎ. భాస్కర్ బుధవారం పలు ప్రధాన కూడళ్లను పరిశీలించారు. ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థను మెరుగుపరచడం, రహదారి క్రమశిక్షణ పెంపుదలపై దృష్టి సారించారు.
రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు మంచిర్యాల పట్టణంలోని ఐబీ చౌరస్తా, బెల్లంపల్లి చౌరస్తా, లక్ష్మీ థియేటర్ చౌరస్తా తదితర ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థ ఏర్పాటు, ట్రాఫిక్ సమస్యల నివారణ, రోడ్డు ప్రమాదాల తగ్గింపునకు చేపట్టాల్సిన చర్యలపై మంచిర్యాల డీసీపీ ఎ. భాస్కర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఏసీపీ ఆర్. ప్రకాశ్, మంచిర్యాల టౌన్ ఇన్స్పెక్టర్ ప్రమోద్ రావు, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ హనన్, మేయర్ ధరణి మధు, డిప్యూటీ మేయర్ సల్ల రమ్యతో పాటు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ, కార్పొరేషన్‌గా అభివృద్ధి చెందిన మంచిర్యాల నగరంలో ట్రాఫిక్ నియంత్రణ, రహదారి క్రమశిక్షణ నగరాభివృద్ధికి అత్యంత కీలకమని అన్నారు. ప్రధాన రహదారుల ద్వారా వివిధ జిల్లాలు, రాష్ట్రాలకు రాకపోకలు సాగుతుండటంతో ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉంటోందని తెలిపారు.
ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ ట్రాఫిక్ ఇంజినీరింగ్ నిపుణులతో అధ్యయనం నిర్వహించిన అనంతరం, స్థానిక ఎమ్మెల్యే ప్రత్యేక చొరవతో తొలి విడతలో నాలుగు ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సిగ్నల్ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేసేందుకు ఫ్రీ లెఫ్ట్‌లు, బొల్లార్డులు, స్టాప్ లైన్లు ఏర్పాటు చేయడంతో పాటు అవసరమైన చోట్ల ప్యాచ్‌వర్క్‌లు, యూ-టర్న్‌ల ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు.
మంచిర్యాలలో కొన్ని కూడళ్లు ఐదు, ఆరు రహదారులు కలిసే ప్రాంతాలుగా ఉండటంతో ప్రత్యేక ప్రణాళికతో ట్రాఫిక్ నిర్వహణ చేపడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి మేయర్, డిప్యూటీ మేయర్‌తో పాటు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు పూర్తి సహకారం అందిస్తున్నారని పేర్కొన్నారు. ట్రాఫిక్ వ్యవస్థను నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన మార్పులు, మెరుగుదలలు చేపడతామని తెలిపారు.
అనంతరం ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, "ట్రాఫిక్ నియమాలు మీ భద్రత కోసమే. సిగ్నల్స్‌ను ఉల్లంఘించడం, నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం వల్ల మీకే కాకుండా ఇతర రహదారి వినియోగదారుల ప్రాణాలకు కూడా ప్రమాదం ఏర్పడుతుంది. అందరూ తప్పనిసరిగా ట్రాఫిక్ సిగ్నల్స్, రహదారి నియమాలను పాటించి పోలీసులకు సహకరించాలి" అని విజ్ఞప్తి చేశారు.












