సింగరేణి కార్మికుల సంక్షేమంలో రాజీపడేది లేదని, సింగరేణి సంస్థ తెలంగాణ ప్రజల ఆస్తి అని, ప్రజాస్వామ్య రక్షణలో జాగరుకతతో ఉంటామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ప్రణాళికా శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. శనివారం మంచిర్యాల జిల్లా కేంద్రంలో వైద్యపరంగా పనిచేయలేని సింగరేణి ఉద్యోగుల కుటుంబ సభ్యులకు నియామక పత్రాలు అందించే కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
శనివారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని పద్మనాయక ఫంక్షన్ హాల్ లో జరిగిన కార్యక్రమంలో, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తో పాటు రాష్ట్ర ఐ.టి. శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అల్లూరి లక్ష్మణ్ కుమార్, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, పలువురు శాసనసభ్యులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా, సింగరేణి సంస్థ తెలంగాణ ప్రజల ఆస్తి అని, దాని సంక్షేమంలో ఎటువంటి రాజీ ఉండదని మంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.
మంచిర్యాల జిల్లాలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసినట్లు మంత్రి తెలిపారు. గూడెం శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయ పునరుద్ధరణకు 70 కోట్ల రూపాయలు, మినీ లిఫ్ట్ ఇరిగేషన్ కు 74.40 కోట్ల రూపాయలు కేటాయించినట్లు ఆయన వెల్లడించారు. వైద్యపరంగా పనిచేయలేని సింగరేణి ఉద్యోగుల కుటుంబాలకు చెందిన 335 మంది అర్హత గల అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు.
సింగరేణి కార్మికులకు 1.25 కోట్ల రూపాయల బీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు, 30 వేల మంది ఒప్పంద, పొరుగు సేవల సిబ్బందికి బోనస్ అందించినట్లు మంత్రి తెలిపారు. తెలంగాణ వనరులను కాపాడతామని, కోల్ బెల్ట్ ప్రాంతంలోని కార్మిక సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం, సింగరేణి సంస్థ సమన్వయంతో కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తామని పేర్కొన్నారు.
రాష్ట్ర ఐ.టి. శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు మాట్లాడుతూ, సింగరేణి సంస్థను, బొగ్గును కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, మెడికల్ అన్ ఫిట్ విషయంలో పారదర్శకంగా వ్యవహరిస్తామని తెలిపారు. సింగరేణి కార్మికులకు, ఒప్పంద సిబ్బందికి బీమా సౌకర్యం కల్పిస్తున్నామని, సంస్థ లాభాలలో వాటా అందిస్తున్నామని ఆయన వివరించారు.












