సింగరేణి సంస్థను అన్ని రంగాలలో సమగ్రంగా అభివృద్ధి చేయడానికి సమిష్టిగా కృషి చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ప్రణాళికా శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. ఆదివారం మంచిర్యాల జిల్లాలోని శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ గనిని సందర్శించిన సందర్భంగా ఏర్పాటు చేసిన ఓపెన్ హౌస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐ.టి., ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, శాసనమండలి సభ్యులు దండే విఠల్, సింగరేణి సి.ఎం.డి. బుద్ధ ప్రకాష్ జ్యోతి, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, డి.సి.పి. ఎ.భాస్కర్, సింగరేణి సంస్థ జనరల్ మేనేజర్లు, సింగరేణి కార్మిక సంఘం ప్రతినిధి జనక్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ, సింగరేణి సంస్థ అభివృద్ధికి అందరూ కలిసి రావాలని కోరారు.
ఓపెన్ కాస్ట్ మైన్ సందర్శనలో భాగంగా, మంత్రి భట్టి విక్రమార్క రక్షణ పద్ధతులు, బొగ్గు నాణ్యత, ఉత్పత్తి ఉత్పాదకత, నిల్వ, రవాణా వంటి అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. గ్రేడ్ 10, 11 బొగ్గు ఉత్పత్తి, బొగ్గు నిల్వ ప్రదేశాలు, సంబంధిత రికార్డులను కూడా ఆయన సమీక్షించారు. కార్మికుల శ్రమ, చెమటతో బొగ్గును ఉత్పత్తి చేసి సంస్థను అభివృద్ధి చేయడమే కాకుండా దేశానికి వెలుగులు అందిస్తున్నారని, వారి ఆత్మగౌరవాన్ని కాపాడటం ప్రభుత్వ బాధ్యత అని ఆయన అన్నారు.
కొంతమంది అసత్య ప్రచారాలకు పాల్పడుతున్నారని, సింగరేణి అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అని, ఇందులో ప్రతి అంశం పారదర్శకంగా జరుగుతుందని, ఇది తెలంగాణ ఆస్తి అని ఆయన స్పష్టం చేశారు. కార్మికుల ఆరోగ్య సమస్యల పరిష్కారం కోసం అధునాతన వైద్య పరికరాలు, నూతన వైద్య విధానాల ద్వారా వైద్య సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు. విద్యారంగ అభివృద్ధిలో భాగంగా జిల్లాలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను ఏర్పాటు చేయడం జరుగుతుందని, ప్రభుత్వ పాఠశాలలను ఆధునిక సౌకర్యాలతో నవీకరించడం జరుగుతుందని పేర్కొన్నారు. గ్రామీణ స్థాయి నుండి సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి సారించిందని, కార్మికుల సమస్యలు పరిష్కరించి వారి పిల్లల విద్యకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని మంత్రి భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. సింగరేణి కార్మికులకు 1.25 కోట్ల రూపాయల ప్రమాద బీమా కల్పించడం జరిగిందని, వారి పిల్లలకు యు.పి.ఎస్.సి. పరీక్షలు, ఇంటర్వ్యూలకు హాజరయ్యేందుకు ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వం, సింగరేణి సంస్థ సమన్వయంతో బొగ్గు గనులను మరింత అభివృద్ధి చేసి కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తామని ఆయన అన్నారు.











