రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీ అంబర్ కిషోర్ ఝా గురువారం కుందనపల్లిలోని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్)ను సందర్శించి, సంస్థలో అమలు చేస్తున్న భద్రతా ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా, సంస్థలో అమలవుతున్న భద్రతా చర్యలు, సెక్యూరిటీ వ్యవస్థ, సిబ్బంది పనితీరు, సీసీ కెమెరాల పర్యవేక్షణ, అగ్నిప్రమాద నివారణ చర్యలు, అత్యవసర పరిస్థితుల నిర్వహణ వంటి అంశాలపై కమిషనర్ మేనేజర్ మనీష్‌తో చర్చించారు.
సంస్థలో భద్రతా ప్రమాణాలను నిరంతరం పటిష్టం చేయాలని, అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి సిబ్బందిని సంసిద్ధంగా ఉంచాలని ఆయన సూచించారు. సీసీ కెమెరాల పనితీరును నిరంతరం పర్యవేక్షించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
సంస్థ వాహనాల డ్రైవర్లు రోడ్డు భద్రతా నిబంధనలను తప్పక పాటించాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని, అతివేగంగా నడపకుండా ట్రాఫిక్ నియమాలను అనుసరించాలని కమిషనర్ సూచించారు. పరిశ్రమల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రమాదాల నివారణకు అప్రమత్తంగా ఉండాలని నొక్కి చెప్పారు.












